బీమా కోరుతూ నేడు జర్నలిస్టుల ఆందోళనలు
ABN , First Publish Date - 2020-07-18T12:39:25+05:30 IST
కరోనా సోకి వారంలో ముగ్గురు పాత్రికేయులు మరణించడంపై పలు జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి.

అమరావతి,(ఆంధ్రజ్యోతి): కరోనా సోకి వారంలో ముగ్గురు పాత్రికేయులు మరణించడంపై పలు జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. పాత్రికేయులను కూడా కరోనా వారియర్స్ జాబితాలో చేర్చి, వారికి బీమా వర్తింపజేయాలని, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు వ్యక్తిగత రక్షణ పరికరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం జర్నలిస్టుల కోర్కెల దినం పాటించాలని ఏపీయూ డబ్ల్యూజే రాష్ట్రకమిటీ పిలుపునిచ్చింది. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయాలని ఏపీ యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేస్‌కుమార్, డీ సోమసుందర్ కోరారు.
జర్నలిస్టుల మృతి బాధాకరం: పవన్
కరోనాతో కడప జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు మృత్యుఒడికి చేరడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. వైద్యసేవలకు సంబంధించి జర్నలిస్టులకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.