నేడు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2020-07-22T12:33:43+05:30 IST

కొత్త మంత్రులుగా ఎంపికైన చెల్లుబోయిన వేణగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేడు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

వేణు, అప్పలరాజుతో ప్రమాణం చేయించనున్న గవర్నర్‌ హరిచందన్‌


అమరావతి, (ఆంధ్రజ్యోతి): కొత్త మంత్రులుగా ఎంపికైన చెల్లుబోయిన వేణగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ వీరితో ప్రమాణం చేయించనున్నారు. కరోనా నేపథ్యంలో రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌ సహా కొద్దిమంది మాత్రమే హాజరుకానున్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేసిన పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావుల సామాజికవర్గానికి చెందిన వేణు, అప్పలరాజులనే ఆయా పదవులకు సీఎం జగన్‌ ఎంపిక చేశారు. కాగా, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదా్‌సకు ఉపముఖ్యమంత్రి హోదా ఇస్తున్నారు.


రెవెన్యూ శాఖను ఆయనకే అప్పగించాలని సీఎం నిర్ణయించారు. వేణుకు రోడ్లు భవనాలు, అప్పలరాజుకు మత్స్యశాఖను అప్పగించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, మంత్రులుగా బాధ్యతలు స్వీకరించనున్న అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ధర్మాన కృష్ణదా్‌సలకు సీఎం మంగళవారం తేనీటి విందు ఇచ్చారు. కృష్ణదా్‌సతో ముచ్చటిస్తూ.. ఉపముఖ్యమంత్రిని చేయడం సహా రెవెన్యూ శాఖ అప్పగించడానికి గల కారణాలను సీఎం వివరించినట్టు తెలిసింది.


వైద్యరంగం నుంచి రాజకీయాల్లోకి

పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు 1980లో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ అనే మత్స్యకార గ్రామంలో జన్మించారు. విశాఖ జిల్లా సింహాచలంలోని ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో పదో తరగతి చదివారు. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎ్‌సలో రాష్ట్ర స్థాయి గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎండి(జనరల్‌ మెడిసిన్‌) చదువుకున్నారు. అనంతరం కేజీహెచ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించారు. 2007లో పలాస-కాశీబుగ్గలో ‘సేఫ్‌’ ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజావైద్యునిగా గుర్తింపు పొందారు. అప్పలరాజు, శ్రీదేవి దంపతులకు అరవ్‌, అర్నవ్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తొలిసారి పలాస నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, పదో తరగతిలో ప్రతిభా అవార్డును అప్పటి సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందుకోవడం విశేషం.


అన్నీ అనూహ్య చాన్సులే!

కాకినాడ/ద్రాక్షారామ: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజకీయ ఎదుగుదల అనూహ్యమనే చెప్పాలి. వ్యాపారం చేసుకునే ఈయనకు సామాజిక సమీకరణాల్లో భాగంగా 2001లో కాంగ్రెస్‌లో రాజోలు నుంచి(స్థానికేతరుడైనా) జడ్పీటీసీ సీటు లభించింది. 2006లో మలికిపురం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2008 నుంచి 2012 వరకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్నారు. 2014లో కాకినాడ రూరల్‌ నుంచి(స్థానికేతరుడైనా) వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రామచంద్రపురం నుంచి వైసీపీ టిక్కెట్‌ను అనూహ్యంగా దక్కించుకుని విజయం సాధించారు. ఇక్కడ నుంచి   పోటీ చేయాల్సిన పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ వేరే నియోజకవర్గానికి మారగా, చెల్లుబోయినకు ఆ టికెట్‌ దక్కింది. ఇక, ఇప్పుడు బోస్‌ ఖాళీ చేసిన మంత్రి పీఠం వేణుకు దక్కడం గమనార్హం.

Updated Date - 2020-07-22T12:33:43+05:30 IST