ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది..

ABN , First Publish Date - 2020-12-31T02:09:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది మాదక ద్రవ్యాలు, గేమింగ్‌, ఇసుక చోరీ, ఎక్సైజ్‌ కేసులు అధికంగా నమోదయ్యాయి. అమ్మాయిల సంరక్షణ కోసమంటూ దిశ చట్టం తీసుకొచ్చినా..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది..

ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది మాదక ద్రవ్యాలు, గేమింగ్‌, ఇసుక చోరీ, ఎక్సైజ్‌ కేసులు అధికంగా నమోదయ్యాయి. అమ్మాయిల సంరక్షణ కోసమంటూ దిశ చట్టం తీసుకొచ్చినా సమర్థవంతంగా పనిచేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేక చట్టం తెచ్చినా.. అమ్మాయిలపై దారుణాలు, హత్యల తీవ్రత పెరిగింది. అయితే, టెక్నాలజీ వినియోగంలో జాతీయ స్థాయి అవార్డులు సాధించడం ఏపీ పోలీసులకు ఈ యేడాది చెప్పుకోదగ్గ అంశమయ్యింది. 


ఏపీలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాదిలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ మాదక ద్రవ్యాల రవాణా, గేమింగ్ యాక్ట్ ఉల్లంఘనలు, ఇసుక చోరీ, ఎక్సైజ్ కేసులు వంటివి ఎక్కువగా నమోదయ్యాయి. ప్రధానంగా ఇసుక, ఎక్సైజ్ కొత్త పాలసీలు తీసుకురావడంతో వినియోగదారులకు ఈ రెండూ గతంలో మాదిరిగా లభ్యం కాకపోవడంతో అక్రమ మార్గాల్లో తరలిస్తున్నారు. మరోవైపు.. వినియోగదారులకు కావాల్సిన మద్యం బ్రాండ్లు కూడా దొరక్కపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి వారికి కావాల్సిన, నచ్చిన బ్రాండ్లను అక్రమంగా తెచ్చుకోవడంతో వీటిని నేరాల సంఖ్య కూడా పెరిగిపోయింది. గుట్కా, మాదక ద్రవ్యాలకు గత కొంతకాలంగా ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న విమర్శలు వచ్చాయి. ఆన్‌లైన్‌ గేమ్స్‌తో అప్పుల్లో కూరుకుపోయిన వాళ్లు చాలామంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మాదక ద్రవ్యాల కేసులు 9 శాతం, గుట్కా కేసులు 13 శాతం, గ్యామింగ్ యాక్ట్ కేసులు 33 శాతం, ఇసుక చోరీ 56 శాతం, ఎక్సైజ్ కేసులు 56 శాతం కేసులు గత ఏడాది కంటే ఎక్కువగా నమోదయ్యాయని డీజీపీ గౌతమ్‌ సావాంగ్ వార్షిక నేర సమీక్ష సమావేశంలో తెలిపారు. 


హత్యలు, అత్యాచారాలు గత ఏడాది కంటే 16 శాతం తగ్గాయని, ఆస్తి నేరాలు 12 శాతం, శారీరక నేరాలు 2 శాతం, వైట్ కాలర్ నేరాలు 13 శాతం, మహిళలపై నేరాలు 7.5 శాతం గత ఏడాది కంటే తగ్గాయని పోలీస్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు. అయితే, ఈ నేరాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం లాక్‌డౌన్‌ అన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది మాత్రం పోలీసులు అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. అధికార పార్టీ నాయకులకు పోలీసులు ఏకపక్షంగా చేస్తున్నారని, ప్రతిపక్ష నాయకులను టార్గెట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఉన్నతస్థాయి వ్యక్తులపై పెట్టిన పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు.. మిస్సింగ్ కేసుల్లో పోలీసుల వ్యవహరశైలి కూడా వివాదాస్పదంగా మారింది. దీంతో అటు ప్రజలు, న్యాయస్థానాల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.


విజయవాడలో దివ్య తేజస్విని అనే అమ్మాయి గొంతు కోసి హతమార్చడం దగ్గర్నుంచి నిన్నటికి నిన్న అనంతపురం జిల్లాలో స్నేహలత హత్య దాకా అమ్మాయిలపై జరుగుతున్న దారుణాలకు నిదర్శనంగా నిలిచాయి. దిశ చట్టం తీసుకొచ్చామని ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంటున్నా, పలు ప్రాంతాల్లో ప్రత్యేకంగా దిశ పోలీస్‌స్టేషన్లను ప్రారంభించినా.. నేరాలు, అఘాయిత్యాలు, హత్యలు తగ్గుముఖం పట్టలేదని, పైగా.. నేరాల్లో తీవ్రత పెరిగిందని విమర్శలు వస్తున్నాయి


విజయవాడలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని అక్టోబర్‌ 15వ తేదీన అత్యంత దారుణంగా హత్యకు గురయ్యింది. ఆమెను గొంతుకోసి హత్య చేసిన ప్రేమోన్మాది నాగేంద్ర.. తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దుర్మార్గం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. పక్కా స్కెచ్‌ ప్రకారమే దివ్య తేజస్వినిని నాగేంద్ర చంపాడని, పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తోనే మర్డర్‌ చేశాడని ఫోరెన్సిక్‌, పోస్ట్‌మార్టం నివేదికలు బయటపెట్టాయి. 


అటు.. విశాఖలో గాజువాక సుందరయ్య కాలనీకి చెందిన వరలక్ష్మి అనే బాలికను ఆమె స్నేహితుడు అఖిల్‌ బ్లేడ్‌తో గొంతుకోసి హత్య చేశాడు. ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డ అఖిల్‌.. అదను చూసి అమ్మాయిని దారుణంగా చంపేశాడు.


అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం చాంపిరి గ్రామానికి చెందిన యువతిని బెస్త రఘు అనే యువకుడు కెనాల్‌లోకి తోసి హత్య చేశాడు. నవంబర్‌ 17వ తేదీన జరిగిందీ దుర్ఘటన. అదేనెల 21వ తేదీన యువతికి పెళ్లి నిశ్చయం కాగా.. 17వ తేదీన మాయమాటలు చెప్పిన ఆ అమ్మాయి ప్రియుడు రఘు ఇంట్లోనుంచి తీసుకెళ్లాడు. అదేరోజు రాత్రి హెచ్‌ఎల్సీలో తోసి హత్య చేశాడు. పోలీసులు ఈ కేసును మొదటగా సీరియస్‌గా తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. నిందితులపై దిశ చట్టం ప్రయోగించాలంటూ యువతి తల్లిదండ్రులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు.


అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎర్రవంకపల్లిలో లారీడ్రైవర్‌ కురువ ఆదినారాయణ.. అదేగ్రామానికి చెందిన బాలికపై డిసెంబర్‌ 18వ తేదీన అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు పోలీస్‌స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. ఇక దిశ చట్టం ఎందుకు తెచ్చినట్టన్న విమర్శలు వచ్చాయి. 


ఈనెల 23వ తేదీన అదే జిల్లాలో మరో దుర్మార్గం బయటపడింది. ఎస్‌బీఐలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని అయిన స్నేహలతను ఆమె ప్రియుడు గుత్తి రాజేష్‌ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్యచేశాడు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బ్యాంకుపేపర్లు, చున్నీ మృతదేహంపై వేసి కాల్చేశాడు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశచట్టం, దిశ పోలీస్‌ స్టేషన్లు అనేవి చెప్పుకోవడానికే పనికి వస్తున్నాయంటూ పోలీసులపై ఒత్తిడి తీవ్రం కావడంతో ఎట్టకేలకు స్నేహలత ప్రియుడు రాజేష్‌తో పాటు.. అతని ఫ్రెండ్‌ కార్తీక్‌లను అరెస్ట్‌ చేశారు.


తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 16 యేళ్ల బాలికను నాలుగు రోజులపాటు ఒకే గదిలో నిర్బంధించి ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారం చేసి.. ఆ తర్వాత కోరుకొండ పోలీస్‌స్టేషన్‌ బయట వదిలి వెళ్లారు. జూలై 17వ తేదీన జరిగిన ఈ సంఘటన అప్పట్లో సంచలనం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. 


ఆగస్టు 4 వతేదీన రాజమండ్రి రూరల్ పాత బొమ్మూరులో  పదేళ్ల  బాలికపై ముగ్గురు  యువకులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాలిక తల్లి బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా వీడియో తీసిన దుండగులు.. బాలికను బెదిరించి బైక్‌పై తీసుకెళ్తుండగా.. కేకలు వేయడంతో స్థానికులు రక్షించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగక పోవడంతో బాలిక తండ్రి షేక్‌ సత్తార్‌ అక్టోబర్‌ 1వ తేదీన ఎస్పీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. 


తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలికి చెందిన వరప్రసాద్‌కు పోలీసు స్టేషన్‌లోనే శిరోముండనం చేయడం తీవ్ర కలకలం రేపింది. వైసీపీకి చెందిన మునికూడలి మాజీ సర్పంచ్ కవల కృష్ణమూర్తి ఫిర్యాదుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జూలై 21 వ తేదీన వరప్రసాద్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి శిరోముండనం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయలేదంటూ బాధితుడు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ప్రభుత్వాన్ని విచారణ చేయాలని ఆదేశించినా.. ఇప్పటివరకు నిందితుడు కవల కృష్ణమూర్తిని పోలీసులు అరెస్ట్‌ చేయలేదు.  



ఇక, కర్నూలు జిల్లా నంద్యాలలో నవంబర్‌ 3వ తేదీన అబ్దుల్‌సలాం కుటుంబం మొత్తం సూసైడ్‌ వీడియో రికార్డ్‌ చేసి రైలుకు ఎదురెళ్లి సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఓ జువెల్లరీ షాపులో గుమాస్తాగా పనిచేసే అబ్దుల్‌సలాంపై రెండు దొంగతనాల కేసులు మోపారు పోలీసులు. చోరీ కేసులో సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టలేదు. పోలీసుల వేధింపులు ఎక్కువ కావడంతో అబ్దుల్‌సలాం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్‌ వీడియో రికార్డ్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో వైసీపీ నాయకుడి హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినా.. పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అంతేకాదు.. అరెస్ట్‌ చేసిన నిందితులపైనా సాధారణ కేసులు పెట్టి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. 


ప్రకాశం జిల్లాలోని కురిచేడులో లాక్‌డౌన్‌ కారణంగా మద్యం దొరక్క శానిటైజర్‌ తాగిన సంఘటనలో గత జూలైలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. లాక్‌డౌన్‌ సమయంలో మద్యంషాపులు మూసి వేయడంతో మద్యానికి బానిసైన కొందరు పర్‌ఫెక్ట్‌ కంపెనీకి చెందిన శానిటైజర్‌ తాగారు. దీంతో.. రెండు రోజుల వ్యవధిలో 16 మంది చనిపోయారు. ఆ శానిటైజర్‌లో ఆల్కహాల్‌కు బదులు మిథైల్‌ క్లోరైడ్‌ కలిపినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో పదిమందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఈ యేడాది గతంలో ఎన్నడూ లేనన్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. రాజధాని రైతులైన ఎస్సీలపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం హైకోర్టునే విస్మయపరిచింది. ఈ పరిణామంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్‌ అయ్యింది.


విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్‌లో గత మే 7వ తేదీన గ్యాస్‌ లీకైన సంఘటనలో 15 మంది దుర్మరణం పాలయ్యారు. చాలామంది అనారోగ్యాల బారిన పడ్డారు. విశాఖ తీరంలోని హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌లో ఆగస్టు 1వ తేదీన క్రేన్‌ కూలిన ఘటనలో 11 మంది చనిపోయారు. 

- సప్తగిరి గోపగోని, చీఫ్‌ సబ్‌ఎడిటర్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి

Updated Date - 2020-12-31T02:09:26+05:30 IST