చరిత్రలో ఇదే తొలిసారి!

ABN , First Publish Date - 2020-09-18T08:47:17+05:30 IST

‘కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది మొత్తం అనేక ఉత్సవాలు, ఊరేగింపులు, కైంకర్యాలు జరుగుతుంటాయి. వాటిలో అత్యంత ప్రధానమైనది

చరిత్రలో ఇదే తొలిసారి!

ఏకాంతంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఆగమశాస్త్రానికి అనుగుణంగానే నిర్ణయాలు

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వ్యూలో  ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు


(తిరుమల, ఆంధ్రజ్యోతి)

‘కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వరస్వామికి ఏడాది మొత్తం అనేక ఉత్సవాలు, ఊరేగింపులు, కైంకర్యాలు జరుగుతుంటాయి. వాటిలో అత్యంత ప్రధానమైనది బ్రహ్మోత్సవం. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు నిర్వహించినందువల్లే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవంగా పేరు వచ్చింది. శ్రీవారు ఆవిర్భవించినప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం జరిగే ఏకాంతసేవలోనూ బ్రహ్మ తిరుఆరాధనలో భాగంగా ప్రత్యేకంగా తీర్థాన్ని ఉంచుతాం. ఆ సమయంలో బ్రహ్మదేవుడే వచ్చి స్వామికి ఆరాధన చేస్తారని క్షేత్ర సంప్రదాయాల్లో ఉంది’ అని తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్న క్రమంలో ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొనిఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా బ్రహ్మోత్సవాలను రద్దు చేయకుండా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు కొంత వ్యత్యాసం ఉందని, వార్షిక బ్రహ్మోత్సవాలనే ప్రధానంగా పరిగణించాలని, నవరాత్రి బ్రహ్మోత్సవాలు కేవలం అలంకార బ్రహ్మోత్సవాలు మాత్రమేనన్నారు. 

అన్నీ ఆలయం లోపలే

‘‘తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఇప్పటివరకు బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించినట్టు ఆధారాల్లేవు. ఇదే మొదటిసారి అనుకోవచ్చు. అంకురార్పణ నుంచి చివరిరోజు నిర్వహించే చక్రస్నానం వరకు అన్నీ ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తాం. రంగనాయక మండపం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, ఉత్సవమూర్తులకు అలంకరణ, స్నపన తిరుమంజన కార్యక్రమాలు జరుగుతాయి. సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో వాహనసేవలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించుకున్నాం. ఈ నిర్ణయాలన్నీ ఆగమశాస్ర్తానికి అనుగుణంగా తీసుకున్నవే.’’ 

అందుకే సర్వభూపాల వాహనం

‘‘కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా తిరుమాడ వీధుల్లో నిర్వహించే వాహనసేవలన్నీ రద్దు చేశాం. ఇందులో భాగంగానే మహారథం, స్వర్ణరథోత్సవాల ఊరేగింపులు కూడా రద్దయ్యాయి. వాటి స్థానంలో సర్వభూపాల వాహనంలో శ్రీవారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చాలని నిర్ణయం తీసుకున్నాం. రథాల్లో ఉత్సవమూర్తులకు నిర్వహించే వైదిక కార్యక్రమాలన్నీ సర్వభూపాల వాహనంలోనూ జరుగుతాయి.’’ 

అయన మహల్లో చక్రస్నానం

‘‘సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు  శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానాన్ని ఈ ఏడాది శ్రీవారి ఆలయంలోని అయన మహల్‌లో నిర్వహించనున్నాం. వేకువజామున పల్లకి ఉత్సవం, తిరుచ్చి నిర్వహించి ఆ తర్వాత 9 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిపిస్తారు. పుష్కరిణి నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలున్న భారీ గంగాళంలో చక్రత్తాళ్వారును  ముంచి చక్రస్నాన ఘట్టాన్ని పూర్తిచేస్తాం. ఇలా చేయడం ద్వారా ఆగమానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అదే రోజు రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.’’


గంటపాటు వాహనసేవ

‘సాధారణంగా బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలు ఒక్కొక్కటి రెండుగంటల పాటు జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ఏకాంతంగానే  వాహనసేవలు జరగనున్న నేపథ్యంలో కల్యాణమండపంలో గంట వ్యవధిలోనే వాహనసేవ పూర్తవుతుంది. ఉదయం 9 నుంచి 10, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య వాహనసేవ జరుగుతుంది. గరుడసేవకు యధావిధిగా శ్రీవిల్లిపుత్తూరు మాలలు, గొడుగులు శ్రీవారికి అందుతాయి. బ్రహ్మోత్సవాల్లో గరుడసేవరోజే రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలు సమర్పించేవారు. అయితే ఆ రోజు రద్దీ ఉండడంతో బ్రహ్మోత్సవాల తొలిరోజు ధ్వజారోహణానికి ఆ సంప్రదాయాన్ని మార్చారు. కానీ ఈ ఏడాది ఉత్సవాలు ఏకాంతంగానే జరుగుతున్న క్రమంలో పూర్వపు సంప్రదాయం ప్రకారం గరుడవాహనసేవ రోజునే ప్రభుత్వం నుంచి పట్టువస్ర్తాలు శ్రీవారికి అందనున్నాయి.’ 

Updated Date - 2020-09-18T08:47:17+05:30 IST