ఎప్పుడు పుట్టావమ్మా... ఏపీ!?
ABN , First Publish Date - 2020-11-01T09:41:23+05:30 IST
రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రం ఏపీ! అంతేకాదు... అసలు రాష్ట్రావతరణ ఎప్పుడు నిర్వహించాలో తెలియని తికమక పరిస్థితి ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే! అయితే...
రాష్ట్రానికి మూడు ‘పుట్టిన రోజులు’
అక్టోబరు 1న ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం
నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ
జూన్ 2న తెలంగాణ ఏర్పాటు
గత ఏడాది మౌనంగా వైసీపీ సర్కారు
ఈసారి నేడు అవతరణ వేడుకలు
‘మీ పుట్టిన రోజు ఎప్పుడు?’ అని అడిగితే... రికార్డుల్లో ఉన్నదా, నిజమైనదా అని అడిగే వాళ్లు ఎందరో!
ఇదే ప్రశ్న ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని’ అడిగితే... ఒరిజనల్‌గా పుట్టిన తేదీ చెప్పాలా? తెలంగాణ కలిసి విశాలాంధ్రప్రదేశ్ మారిన రోజు చెప్పాలా? లేక... అదే తెలంగాణతో విడిపోయిన రోజును చెప్పాలా? అని తికమకపడుతుంది. ఎందుకంటే... ‘ఆంధ్ర’ప్రదేశ్ మూడుసార్లు, మూడు రకాలుగా పుట్టింది మరి! రాష్ట్రానికి మూడు రాజధానుల్లా... మూడు పుట్టిన రోజులన్న మాట!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రం ఏపీ! అంతేకాదు... అసలు రాష్ట్రావతరణ ఎప్పుడు నిర్వహించాలో తెలియని తికమక పరిస్థితి ఉన్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే! అయితే... ఈ శషభిషలకు వైసీపీ సర్కారు తెరదించింది. ‘నవంబరు 1’నే అవతరణ దినోత్సవంగా జరపాలని అధికారికంగా నిర్ణయించింది. మరి... నవంబరు 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌కు ఏదైనా సంబంధం ఉందా... అంటే, కొంచెం కూడా లేదు! నిజానికి... మన రాష్ట్రానికి ‘మూడు అవతరణ’లు!
అప్పుడు ఇలా పుట్టింది...
మద్రాసీలుగా పిలిపించుకుంటూ... మద్రాస్ రాష్ట్రంలో భాగమైన తెలుగు వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ అప్పట్లో భారీ ఉద్యమమే జరిగింది. పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953 అక్టోబరు 1వ తేదీన... మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ‘ఆంధ్ర రాష్ట్రం’ ఆవిర్భవించింది. అప్పుడు... కర్నూలు మన రాజధాని. అంటే, అక్టోబరు 1వ తేదీ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం. అప్పట్లో... రాయలసీమ, కోస్తా జిల్లాలతోపాటు బళ్లారి, బరంపురం కూడా ఆంధ్ర రాష్ట్రంలో భాగంగానే ఉండేవి. ఆ తర్వాత బళ్లారి కర్ణాటకలో, బరంపురం ఒడిసాలో కలిసిపోయాయి.
అలా కలిసిపోయింది...
అక్టోబరు1న ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుక మూడేళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 1954, 1955లో ఆంధ్రరాష్ట్ర అవతరణ వేడుకలు జరిగాయి. అప్పటికే పక్కనే ఉన్న తెలంగాణలోనూ తెలుగే మాట్లాడతారు కదా, తెలుగువారంతా ఒక్కరాష్ట్రంగా ఉంటే గొప్పగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో ‘విశాలాంధ్ర’ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై తెలంగాణ వైపు నుంచి అభ్యంతరాలు, భారీ కసరత్తు, కమిషన్ల అనంతరం... 1956 నవంబరు 1వ తేదీన రాయలసీమ, కోస్తా, తెలంగాణతో కూడిన ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పడింది. ఇది రాష్ట్రానికి రెండో పుట్టిన రోజు.ఙ
మళ్లీ విడిపోయి...
1956 నుంచి 2013 వరకు ‘నవంబరు 1’వ తేదీయే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం! అయితే, 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ‘జూన్ 2’ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మరి... సీమాంధ్రతో కూడిన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? దీనిపై అప్పట్లోనే చర్చ జరిగింది. ‘జూన్ 2నే మనమూ జరుపుకోవాలి’ అని అతికొద్ది మంది అభిప్రాయపడ్డారు. భౌగోళికంగా తిరిగి ‘ఆంధ్రరాష్ట్రం’ ఏర్పడింది కాబట్టి... అక్టోబరు 1నే ఆవిర్భావ దినోత్సవంగా జరపాలని కొందరు.. ‘నవంబరు 1’నే అనుసరించాలని మరికొందరన్నారు. అయితే... విభజన కష్టాల నుంచి గట్టెక్కి... ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పం చెప్పుకొంటూ... ‘జూన్ 2’వ తేదీన ‘నవ నిర్మాణ దీక్ష’ చేపట్టారు. అక్టోబరు 1న కానీ, నవంబరు 1న గానీ ఆవిర్భావ వేడుకలు జరపలేదు.
ఈసారి నేడు అవతరణ వేడుకలు
ఇప్పుడు మళ్లీ...
2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు జూన్ 2న ‘నవ నిర్మాణ’ సంకల్పం ఏదీ చెప్పుకోలేదు. అలాగని... అక్టోబరు 1న గానీ, నవంబరు 1నగానీ అవతరణ దినోత్సవమూ జరపలేదు. ఈ ఏడాది నవంబరు 1వ తేదీన రాష్ట్రావతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిజానికి... నవంబరు 1న ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కూ, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్‌కూ భౌగోళికంగా ఏమాత్రం సంబంధం లేదు. తెలంగాణతో కూడిన ‘ఆంధ్రప్రదేశ్’ అనే రాష్ట్రం చరిత్రలో కలిసిపోయింది. ఇప్పుడు సీమాంధ్ర మాత్రమే ఉంది. 1953 అక్టోబరు 1వ తేదీ ఆవిర్భవించిన రాష్ట్రమే స్వల్ప మార్పులతో ఇప్పుడూ ఉంది. అందువల్ల... అక్టోబరు 1నే రాష్ట్రావతరణ దినోత్సవంగా పరిగణించడమే సరైనదనేది విస్తృతాభిప్రాయం!
