అమెరికా కంపెనీతో ఏపీ ఒప్పందం.. కీలక మలుపు : గౌతమ్ రెడ్డి
ABN , First Publish Date - 2020-07-19T02:45:42+05:30 IST
కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఆంఫినాల్ సంస్థ..

అమరావతి : కోవిడ్-19 విజృంభణ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఆంఫినాల్ సంస్థ.. ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ (AMTZ)జరిగిన ఒప్పందం కీలక మలుపవుతుందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. అధునాతన వైద్య పరికరాల తయారీ కోసం సుమారు 20 కోట్లకు పైగా పెట్టుబడులకు ఆంఫినాల్ ఒప్పందం చేసుకోవడం అభినందనీయమన్నారు. ఈ ఎంవోయూతో వందలాది మంది శాస్త్రవేత్తలు, మెడికల్ , ఫార్మా, ఇంజినీరింగ్ నిపుణులకు ఉద్యోగవకాశాలు తథ్యమని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. వైద్య పరికరాల తయారీలో 70 ఏళ్ల అపార అనుభవమున్న ఆంఫినాల్....మనిషి శరీరంలో భౌతికమై మార్పులకు సంబంధించిన ఉష్ణోగ్రత, ప్రాణవాయువైన ఆక్సిజన్, హ్యుమిడిటీ, ఒత్తిడి వంటి వాటి స్థాయిలను, కొలిచి, నిర్ధారించే పరికరాల రూపకల్పనలో ప్రత్యేక పేరుందన్నారు. తాజా ఒప్పందంతో ఆంఫినాల్ ఇపుడు అధునాతన సెన్సర్ల తయారీకి చిరునామాగా మారనుందన్నారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మేకపాటి మాట్లాడుతూ.. ప్రపంచమంతా కోవిడ్-19 విపత్తులా విజృంభిస్తున్న సమయంలో ఇలాంటి వైద్యపరికరాల తయారీ ఒప్పందాలు ఎంతో అవసరమని మంత్రి స్పష్టం చేశారు. 4 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శుభ్రత, మంచి అలవాట్లపై ప్రజలకు శ్రద్ధ పెరిగిందన్నారు. కరోనా కారణంగా వైద్యరంగం, ఫార్మా, పరిశోధనలపై ప్రాముఖ్యత, సముచిత గౌరవం తెచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. యావత్ ప్రపంచానికి కీలకమైన వైద్యరంగాన్ని మరో స్థాయికి చేర్చే ఈ ఒక్క ఒప్పందం కోట్లాది మంది భవిష్యత్ కు పరోక్ష్యంగా, ప్రత్యక్ష్యంగా భరోసా కలిగించడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఎంవోయూలో కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్, ప్రొఫెసర్ విజయ్ రాఘవన్, ఫార్మాసిటికల్, మెడికల్ డివైజస్ సెక్రటరీ, పీడీ వాఘేలా, ఎలక్ట్రానిక్స్ శాఖ సెక్రటరీ అజయ్ సాహ్నీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. నైపుణ్య విశ్వవిద్యాలయాలు, కాలేజీల ఏర్పాటు దిశగా మరింత వేగం పెంచాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నైపుణ్యశాఖధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే 30 స్కిల్ కాలేజీలకు అవసరమైన భూమిని గుర్తించినట్లు , 12 చోట్ల భూమికి సంబంధించిన సర్వే వివరాలు పూర్తయినట్లు నైపుణ్యవృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రామ్, మంత్రి గౌతమ్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.