ఎన్నికల సంఘానిది సాహసోపేత నిర్ణయం: ఎమ్మెల్సీ తిప్పేస్వామి
ABN , First Publish Date - 2020-03-16T21:32:58+05:30 IST
దొడ్డిదారి రాజకీయాలను ఎన్నికల సంఘం అడ్డుకోవడం హర్షణీయమని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు.
మడకశిర: దొడ్డిదారి రాజకీయాలను ఎన్నికల సంఘం అడ్డుకోవడం హర్షణీయమని ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి అన్నారు. స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో నిలబడి, గెలవాలే కానీ అధికార బలంతో బరితెగించి నీచమైన రాజకీయాలకు పాల్పడొద్దని హితవు పలికారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు గుర్తుకు వస్తున్నాయన్నారు. చట్టం తెలియని వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండడం ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారిపోయారని, వెంటనే డీజీపీని బాధ్యతల నుంచి తప్పించి.. పారా మిలటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాయదుర్గంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, రాష్ట్రంలో జరుగుతున్నహింస, అరాచకాలను వెంటనే నిలిపి.. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిష్పక్షపాతంగా జరిపించాలని తిప్పేస్వామి కోరారు.