అరాచక పాలన
ABN , First Publish Date - 2020-09-03T08:18:27+05:30 IST
రాష్ట్రంలో దుర్మార్గమైన ఆలోచనలతో కూడిన అరాచక పాలన సాగుతోందని టీడీపీ అధినేత,

బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో నోరునొక్కాలని చూస్తున్నారు
చంద్రబాబు ఆగ్రహం
ఇద్దరు మాజీ మంత్రులకు పరామర్శ
వారి ఇళ్లకు వెళ్లి సంఘీభావం
విజయవాడ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దుర్మార్గమైన ఆలోచనలతో కూడిన అరాచక పాలన సాగుతోందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడుతున్న టీడీపీ నాయకుల నోళ్లు నొక్కాలని ప్రభుత్వం చూస్తోందని.. బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
రెండు వేర్వేరు కేసుల్లో అరెస్టయి, బెయిల్‌పై విడుదలై.. ప్రస్తుతం విజయవాడ కరెన్సీ నగర్‌లోని తమ నివాసాల్లో ఉంటున్న మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను చంద్రబాబు బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
‘ఈఎ్‌సఐ కొనుగోళ్లకు సంబంధించి అప్పుడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు లెటర్ ఇవ్వడం తప్ప డబ్బులు తీసుకున్న దాఖలాలు లేవని ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఆయన అవినీతికి పాల్పడినట్టు సాక్ష్యాధారాలు ఉన్నాయా అని కేసు విచారణలో న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు సాక్ష్యాలు దొరకలేదని చెప్పారు. శాసనసభలో ప్రజాసమస్యలపై పోరాడుతున్న అచ్చెన్నాయుడి నోరునొక్కేయాలని బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్య విధానం కాదు.
ఎవరికీ హాని తలపెట్టని కొల్లు రవీంద్రపై కేసు పెట్టడం దుర్మార్గం. ’ అన్నారు. పోలీసులు చట్టాలను గౌరవిస్తూ పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఆయన వెంట మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, విజయవాడ ఎంపీ కేశినేని నాని, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఉన్నారు.

అమిత్‌షాకు బాబు ఫోన్
అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు బుధవారం ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.