ఎక్స్‌ప్రె‌స్‌వే నుంచి అమరావతి అవుట్‌!

ABN , First Publish Date - 2020-10-19T09:21:43+05:30 IST

అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు రాతను జగన్‌ ప్రభుత్వం మార్చేసింది.

ఎక్స్‌ప్రె‌స్‌వే నుంచి అమరావతి అవుట్‌!

దిశమారిన అనంత-అమరావతి ప్రాజెక్టు

చిలకలూరిపేటదాకే రహదారి పరిమితం

394 కి.మీ. పొడవులో 59 కి.మీ. తొలగింపు

25వేలకోట్ల ప్రాజెక్టు 19వేలకోట్లకు కుదింపు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌  ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు రాతను జగన్‌ ప్రభుత్వం మార్చేసింది. ఎక్స్‌ప్రె్‌సవే జీవన రేఖనుంచి రాజధానిని తోసేసి.. ప్రాజెక్టును 335 కిలోమీటర్లకే కుదించేసింది. అమరావతి, దాని పరిసర ప్రాంతాలున్న 60 కిలోమీటర్ల మేర రహదారి ప్రతిపాదనను తొలగించి..  ప్రాజెక్టును చిలుకలూరిపేటకే పరిమితం చేసింది. ఈ మేరకు తాజాగా బులెటిన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించాక... వెనుకబడ్డ రాయలసీమను రాజధానికి అనుసంధానించేందుకు అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేను 2016లో ప్రతిపాదించారు. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు మీదుగా అమరావతికి నాలుగు, ఆరు వరుసల రహదారిని ప్రతిపాదించారు. 550 కి.మీ. పొడవైన రహదారిలో కొత్తగా 394.80 కి.మీ. మేర నిర్మించాల్సి ఉంది. అప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో 163 కి.మీ. మేర రహదారి నిర్మాణం జరిగింది. 


అప్పుడలా.. ఇప్పుడిలా..

అనంతపురం జిల్లా మర్రూరు నుంచి అమరావతి పరిధిలోని పెదపరిమి వరకు రహదారిని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. ఇందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.  భూ సేకరణకయ్యే రూ. 2200 కోట్లలో ఏపీ సగం ఖర్చు భరించాలన్న షరతుకు రాష్ట్రం అంగీకరించింది. డీపీఆర్‌లు ఆమోదం పొందాక ఎక్స్‌ప్రె్‌సవేకు 544ఎఫ్‌గా నంబర్‌ కేటాయించారు. ఆ తర్వాత కేంద్రం తీసుకొచ్చిన భారతమాల పరియోజన పథకంలో తొలి దశ కింద ఈ ప్రాజెక్టును చేపడతామని కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ (ఎంఓఆర్‌టీహెచ్‌) వెల్లడించింది. ఇదంతా నిరుడు అక్టోబరు నాటి మాట! జగన్‌ సీఎం అయ్యాక 3 రాజధానులను తెరపైకి తెచ్చారు. దీనిప్రకారం.. రాజధానిగా అమరావతి ఎలాగూ ఉండదు కాబట్టి అనంత- అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే పొడవును తగ్గించాలని భావించారు. భూ సేకరణ వ్యయం ఎక్కువువతోందని, దాన్ని భరించడం కష్టంగా ఉన్న కారణంగానే 59.80 కి.మీ. (చిలకలూరిపేట-పెదపరిమి) రహదారిని తొలగించారు.


దీనివల్ల 3,700 కోట్లమేర భారం తగ్గుతోందని ప్రభుత్వం అంటోంది. అదే సమయంలో ఈ ప్రాజెక్టును అనంతపురం నుంచి బెంగళూరు వరకు విస్తరింపచేయాలని ప్రతిపాదించింది.  ఒకవేళ కేంద్రం ఆమోదించి ఆ విధమైన విస్తరణ కోసం భూసేకరణ చేయాల్సివస్తే ఆ భారాన్ని మోయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా! అప్పుడు మాత్రం ఈ ప్రాజెక్టు వ్యయం పెరగదా? అంటే సమాధానమే లేదు. ప్రాజెక్టు వ్యయం రూ. 25వేలకోట్లపైనే కానుందని ముందుగా వేసిన అంచనా. తాజా నివేదికలో రూ. 19,877కోట్ల వ్యయం కానుందని పేర్కొన్నారు.

Updated Date - 2020-10-19T09:21:43+05:30 IST