నాడు సత్కారం.. నేడు సంకెళ్లా?

ABN , First Publish Date - 2020-10-31T07:38:42+05:30 IST

‘‘నాడు రాజధానికి భూములు తీసుకున్నప్పుడు బట్టలు పెట్టి సత్కరించారు. నేడు చేతులకు సంకెళ్లు వేసి అవమానిస్తున్నారు’’ అని అమరావతి ప్రాంత రైతులు, కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

నాడు సత్కారం.. నేడు సంకెళ్లా?

భూములిచ్చిన దళితులకు వెన్నుపోటా?

సర్కారుకు రాజధాని రైతుల సూటి ప్రశ్న

318వ రోజు కొనసాగిన అమరావతి ఉద్యమం


గుంటూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): ‘‘నాడు రాజధానికి భూములు తీసుకున్నప్పుడు బట్టలు పెట్టి సత్కరించారు. నేడు చేతులకు సంకెళ్లు వేసి అవమానిస్తున్నారు’’ అని అమరావతి ప్రాంత రైతులు, కూలీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలన్న డిమాండ్‌తో రైతులు చేస్తున్న ఉద్యమం శుక్రవారానికి 318వ రోజుకు చేరింది. భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేయడం ఎక్కడైనా ఉందా? అని రైతులు, కూలీలు, మహిళలు సర్కారును ప్రశ్నించారు. చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ.. దళితులకు వెన్నుపోటు పొడుస్తున్నారంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు తుళ్లూరు దీక్షా స్థలికి చేరుకుని అక్కడి నుంచి జేఏసీ, జాతీయ జెండాలతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. సంకెళ్లు వేయమని ఆదేశాలిచ్చిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని  జేఏసీ నేతలు హెచ్చరించారు. శనివారం ‘జైల్‌ భరో’ కార్యక్రమం చేపడతామని తెలిపారు.   


మానవ హక్కులు ఉన్నాయా?: నక్కా ఆనందబాబు ఫైర్‌

‘‘ఏపీలో మానవ హక్కులు ఉన్నాయా? ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం చరిత్రలో ఎక్కడా లేదు’’ అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. రాజధాని రైతులకు సంకెళ్లు వేయడంపై శుక్రవారం గుంటూరులో ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా చేతులకు బేడీలు వేసుకుని రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. అమరావతి ఉద్యమానికి పోటీగా పెయిడ్‌ ఉద్యమానికి ప్రభుత్వమే తెర తీసిందని.. ఇదేంటని ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి బేడీలు వేసి మరీ జైళ్లకు తరలించిందని ఆనందబాబు మండిపడ్డారు. కక్షపూరితంగానే  రైతులను దసరా పండగ రోజు అరెస్టు చేసి జైలుకు పంపారని విమర్శించారు. 

Updated Date - 2020-10-31T07:38:42+05:30 IST