అమరావతే రాజధాని

ABN , First Publish Date - 2020-12-15T09:01:10+05:30 IST

‘ఏపీ ప్రజలకు అమరావతిలో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుంది. మూడు రాజధానులకు మేం వ్యతిరేకం.

అమరావతే రాజధాని

మూడుకు మేం వ్యతిరేకం

ఒక్క రాజధాని కోసం ఉద్యమిస్తాం

మోదీ ప్రతినిధిగా చెబుతున్నా..

ప్రధాని రైతులతోనే ఉన్నారు

జగన్‌లా మాట తప్పం... మడమ తిప్పం

2024లో అధికారమిస్తే 

రూ.5 వేల కోట్లతో రాజధాని అభివృద్ధి

బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటన


అమరావతిలో రైతులతో సమ్మేళనంగుంటూరు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ‘ఏపీ ప్రజలకు అమరావతిలో అద్భుత రాజధానిని బీజేపీ నిర్మించి ఇస్తుంది. మూడు రాజధానులకు మేం వ్యతిరేకం. రెండో ఆలోచనే లేదు. అమరావతే రాజధాని’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తుళ్లూరులో కిసాన్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చిన్న, సన్నకారుల రైతుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘ప్రధాని మోదీ అమరావతి రైతులతోనే ఉన్నారు. మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా. అమరావతిలోనే రాజధాని ఉండాలనేది బీజేపీ లక్ష్యం. ఇందులో రెండో అంశానికి తావు లేదు. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే సొంత భూమిలో కడుతున్నాం. జగన్‌ మూడు రాజఽధానుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.


రూ.1800 కోట్లతో నిర్మితమవుతున్న ఎయిమ్స్‌ హాస్పిటల్‌ ఆగిందా? దుర్గమ్మ ఫ్లై ఓవర్‌ పూర్తి చేశామా లేదా? బెంజ్‌సర్కిల్‌ వద్ద రెండు ఫ్లైఓవర్లు కడుతున్నామా? లేదా..? ఇవన్నీ ప్రధాని మోదీ రైతులతోనే ఉన్నారనడానికి నిదర్శనం’ అని సోము స్పష్టం చేశారు. సీఎం జగన్‌లా బీజేపీ మాటా.. మడమా తిప్పదు అని వీర్రాజు వ్యాఖ్యానించారు. రాజధానిగా అమరావతి ఒక్కటే ఉండాలని తాము ఉద్యమం చేపడతామని ప్రకటించారు. ‘2024లో బీజేపీకి రాష్ట్రంలో అధికారం ఇవ్వండి. అమరావతిని రూ.5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తాం. రైతుల ప్లాట్‌లకు రూ.2 వేల కోట్లతో అన్ని సౌకర్యాలూ కల్పిస్తాం’ అని తెలిపారు. 


జగన్‌ చట్టవ్యతిరేక చర్యలనూ సహించం

ఆందోళన చేస్తున్న రాజధాని రైతు నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడాలని సోము సూచించారు. బీజేపీ నేతలు  రెండు నాల్కలతో మాట్లాడరని అన్నారు. రాజధానితో పాటు రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేయాలని, 64 వేల ప్లాట్లు పోగా మిగిలిన భూమిని అభివృద్ధి పరచాలని డిమాండ్‌ చేశారు. అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవేకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా మోదీ చేయిస్తున్నదేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని మార్చినా.. కేంద్ర సంస్థలన్నీ అమరావతిలోనే ఉంటాయని అన్నారు. ‘ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరులో డిఫెన్స్‌ అకాడమీ నిర్మిస్తున్నాం. నాడు అమరావతికి మోదీ శంకుస్థాపన చేసి పవిత్ర గంగా, నర్మద నీరిచ్చిన గంటకే గుంటూరు ఎంపీ ప్రధానిని విమర్శించారు. మోదీ పర్యటనను అడ్డుకునేలా నల్ల బ్యానర్లు కట్టించినా మేమేమీ మాట్లడలేదు. రాజధానిలో ఎన్‌ఐడీ నిర్మాణం జరుగుతోంది. జగన్‌ చట్ట వ్యతిరేక చర్యలు తీసుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదు.


రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడితే సహించం’ అని చెప్పారు. అభివృద్ధి జరగలన్నా... రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా వచ్చే ఎన్నికలలో బీజేపీని గెలిపించాలని వీర్రాజు కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన భారతీయ కిసాన్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ రాజకీయ చదరంగంలో అమరావతి రైతుల్ని బలి పశువుల్ని చేశారని మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు బీజేపీ, టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఉందని, ఈ విషయంపై కేంద్రం స్పందించాలని  డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-12-15T09:01:10+05:30 IST