అమరావతే రాజధాని

ABN , First Publish Date - 2020-11-19T10:08:23+05:30 IST

‘అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం మాకు చెప్పింది. మా స్టాండ్‌ కూడా అదే. అందులో భాగంగానే లాంగ్‌ మార్చ్‌ చేయాలనుకున్నా.

అమరావతే రాజధాని

జనసేన వైఖరిలో మార్పులేదు..

బీజేపీ అధిష్ఠానమూ అమరావతినే రాజధానిగా చూస్తోంది

ప్రభుత్వం మారిందని రాజధాని మార్చేస్తాం అంటే కుదరదు

చిరిగిన దుస్తులతోనే ఉద్యమాలు చేయాలా?

ఉద్యమకారులపై వైసీపీ వ్యాఖ్యలు సరికాదు 

అమరావతి జేఏసీ నేతలతో పవన్‌ 


అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘అమరావతే రాజధానిగా ఉంటుందని బీజేపీ అగ్రనాయకత్వం మాకు చెప్పింది. మా స్టాండ్‌ కూడా అదే. అందులో భాగంగానే లాంగ్‌ మార్చ్‌ చేయాలనుకున్నా. దురదృష్టవశాత్తు ముందుకు తీసుకువెళ్లలేకపోయాం’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అమరావతి జేఏసీ నేతలతో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అమరావతి ఉద్యమానికి సంబంధించి జనసేన ఏ రోజూ వెనుకడుగు వేయలేదు. కోర్టు అఫిడవిట్‌ అడిగినప్పుడు పార్టీ పక్షాన వేశాం. రాజధాని వ్యవహారంలో మా వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా అమరావతినే రాజధానిగా చూస్తున్నామని స్పష్టంగా చెప్పింది. ఢిల్లీ వెళ్లబోయే ముందురోజు కూడా అమరావతే ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ అని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానం చేసింది. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకువెళ్తుందన్న విషయం మా పార్టీ పరిధిలోని అంశం కాదు. ప్రభుత్వం మారింది కాబట్టి మార్చేస్తాం అంటే కుదరదు’ అని స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమానికి జనసేన పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. అమరావతి ఉద్యమకారులపై వైసీపీ వ్యాఖ్యలు సరికాదని పవన్‌కల్యాణ్‌ అన్నారు. బంగారం పెట్టుకుని ఉద్యమం చేయకూడదా? ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకునే ఉండాలా? అని మండిపడ్డారు.


పవన్‌ స్పందన బాగుంది: జేఏసీ

అమరావతి ఉద్యమానికి సంబంధించిన అన్ని విషయాలను పవన్‌ కల్యాణ్‌కు వివరించామని జేఏసీ నేతలు శివారెడ్డి, రాయపాటి శైలజ, గద్దె తిరుపతిరావు విలేకరులతో చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ సానుకూలంగా స్పందించారని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారని తెలిపారు. అవసరమైన సమయంలో బీజేపీతో కలిసి ఉద్యమంలోకి వస్తామన్నారన్నారని చెప్పారు. మోదీ, అమిత్‌షాలతో అపాయింట్‌మెంట్‌కు ప్రయత్నం చేస్తానని చెప్పారన్నారు. 


337వ రోజు కొనసాగిన ఆందోళనలు

గుంటూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘నాగ దేవత అండగా నిలవాలి. రాజధాని విషయంలో సీఎం జగన్‌ మనసు మారాలి’ అంటూ రాజధాని మహిళలు నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న డిమాండ్‌తో రైతులు ఆందోళనలు బుధవారానికి 337వ రోజుకు చేరాయి. తుళ్లూరు, మందడం, వెలగపూడి, ఐనవోలు, వెంకటపాలెం తదితర గ్రామాల్లో రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్ధండరాయునిపాలెం, బోరుపాలెంలో మహిళలు నాగదేవతకు పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2020-11-19T10:08:23+05:30 IST