చరిత్రకు ఆనవాలు అమరావతి
ABN , First Publish Date - 2020-05-19T09:14:59+05:30 IST
నవ్యాంధ్ర నడిబొడ్డున ఉన్న అమరావతి ఆంధ్రుల చరిత్రకు ఆనవాలు అని రాజధాని రైతులు స్పష్టం చేశారు.

153వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు
గుంటూరు, మే 18(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర నడిబొడ్డున ఉన్న అమరావతి ఆంధ్రుల చరిత్రకు ఆనవాలు అని రాజధాని రైతులు స్పష్టం చేశారు. ‘ఈ నేలకు ఘనమైన చరిత్ర ఉంది. ఇక్కడి నుంచి ఎందరో రాజులు పరిపాలన జరపటంతో పాటు, బౌద్ధం విలసిల్లిన భూమి. అటువంటి ప్రాంతం నుంచి రాజధానిని తరలించటం తగదు’ అని తేల్చిచెప్పారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాం త ప్రజలు చేస్తోన్న ఆందోళనలు సోమవారానికి 153వ రోజుకు చేరాయి. ‘కులమతాలకు అతీతంగా ప్రభుత్వం మాట నమ్మి రాష్ట్ర భవిష్యత్తు కోసం 33వేల ఎకరాలను త్యాగం చేశాం. అలాంటి మా నోట్లో మట్టికొట్టటం తగదు’ అంటూ అమరావతి రైతులు ఆవేదనవ్యక్తం చేశారు. అమరావతి రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక రైతులు కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.