భయభ్రాంతులను చేయడానికే బలగాల మోహరింపు

ABN , First Publish Date - 2020-11-06T09:21:49+05:30 IST

న్యాయం చేయమని పోరాడుతున్న తమని భయభ్రాంతులను చేయడానికే భారీగా గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరిస్తున్నారని అమరావతి రైతులు

భయభ్రాంతులను చేయడానికే బలగాల మోహరింపు

మూడు రాజధానుల శిబిరానికి అనుమతిచ్చి మమ్మల్ని ఖాళీ చేయమనడమేంటి?: మందడం ‘శిబిరం’లో ఆగ్రహావేశాలు


గుంటూరు, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): న్యాయం చేయమని పోరాడుతున్న తమని భయభ్రాంతులను చేయడానికే భారీగా గ్రామాల్లో పోలీసు బలగాలను మోహరిస్తున్నారని అమరావతి రైతులు మండిపడ్డారు. గురువారం మంత్రిమండలి సమావేశానికి సీఎం వస్తున్నారంటూ మందండం గ్రామంలో పోలీసులు దుకాణాలను మూయించివేశారు. శిబిరంలోని రైతులను ఖాళీ చేయాలంటూ ఆదేశించారు. అంగీకరించని రైతులు, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఇదే ప్రాంతంలో మూడు రాజధానులు కావాలంటూ ఏర్పాటు చేసిన శిబిరానికి అనుమతి ఇచ్చి, తమని వెళ్లమనడం ఏమిటంటూ ప్రశ్నించారు. వారిని ఖాళీ చేయించి పంపేస్తే తామూ వెళ్లిపోతామంటూ స్పష్టం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వ్యూహం మార్చుకున్న పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 200 మందికిపైగా కానిస్టేబుళ్లను మోహరించారు.


సీఎం కాన్వాయ్‌ వెళ్లే సమయంలో రైతులు ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మాక్‌ మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌ సీఎంగా, ఇతర రైతులు మంత్రులుగా వ్యవహరించారు. రైతులకు సీపీఎం నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు మద్దతు తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ చేస్తోన్న ఆందోళనలు గురువారానికి 324వ రోజుకు చేరాయి. 29 గ్రామాల రైతులు వివిధ రూపాల్లో నిరసనలు కొనసాగించారు. 

Updated Date - 2020-11-06T09:21:49+05:30 IST