ఆగని పోరు!
ABN , First Publish Date - 2020-04-26T09:44:26+05:30 IST
: అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంటూ సీఎం జగన్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరు ఆపేది లేదని రాజధాని ప్రాంత రైతులు స్పష్టం చేశారు.

మాస్కులు కుట్టి వినూత్న నిరసన
అమరావతిపై స్పష్టత కావాలన్న రైతులు
130వ రోజు కొనసాగిన ఆందోళనలు
గుంటూరు, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): అమరావతినే ఏకైక రాజధానిగా పేర్కొంటూ సీఎం జగన్ నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరు ఆపేది లేదని రాజధాని ప్రాంత రైతులు స్పష్టం చేశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే సాగాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శనివారానికి 130వ రోజుకు చేరాయి. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు, మహిళలు, కూలీలు తమ ఇళ్లలోనే నిరసన తెలిపారు. కొందరు మాస్కులు కుట్టి నిరసన తెలిపారు. సదరు మాస్కులను ఆయాప్రాంతాల్లోని ప్రభుత్వ సిబ్బందికి పంచారు. 29 రాజధాని గ్రామాల్లో రైతులు ఎవరి ఇళ్లలో వారు నిరసన ప్రదర్శనలు చేశారు. తాడికొండ మండలం పొన్నెకల్లులో వరసగా శనివారం ఏడవ రోజు నిరసన దీక్షలు కొనసాగించారు. కాగా, మహిళా రైతులు మాస్కులు కుట్టి పంపిణీ చేశారు. మందడం గ్రామానికి చెందిన దివ్యాంగురాలు నాగమ్మ తన కొడుకు భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో ఉన్న ఎకరాన్ని రాజధానికి ఇచ్చారు. అయితే, వైసీపీ ప్రభుత్వ నిర్ణయంతో తమ జీవితాలు తలకిందులయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆమె ఒక్క కాలుతోనే మాస్కులు కుట్టి నిరసన వ్యక్తం చేశారు. ఆ మాస్కులను శనివారం వివిధ గ్రామాల పంచాయతీ సిబ్బందికి పంపిణీ చేసి అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వేడుకున్నారు. ‘రాష్ట్రానికి అమరావతితోనే వెలుగు’ అంటూ అమరావతి వెలుగు కార్యక్రమం కింద మహిళలు, రైతులు రాత్రి 7.30 గంటలకు ఇళ్లలో విద్యుత్ లైట్లు ఆపి, దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదాలు చేశారు.