అంబులెన్స్ ఆలస్యం..
ABN , First Publish Date - 2020-08-11T09:26:10+05:30 IST
అంబులెన్స్ ఆలస్యం..

- ఊపిరాడక కరోనా బాధితుడి మృతి
సామర్లకోట, ఆగస్టు 10: కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆస్పత్రికి చేర్చేందుకు అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే అది రావడం ఆలస్యమైంది. దీంతో ఊపిరాడక ఆ వ్యక్తి ప్రాణాలు విడిచాడు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. నీలమ్మ చెరువు సమీపానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. కుటుంబ సభ్యులు ఉదయం నుంచి మున్సిపల్ వలంటీర్లు, సచివాలయ సిబ్బంది కోసం యత్నించినా వారెవరూ అందుబాటులోకి రాలేదు. అంబులెన్స్ కోసం ప్రయత్నించడంతోపాటు ప్రభుత్వాస్పత్రి వైద్య సిబ్బందికి కూడా సమాచారం అందించారు. సుమారు 6 గంటల అనంతరం అంబులెన్స్ చేరుకుంది. కరోనా బాధితుడిని అందులోకి ఎక్కిస్తుండగా ఊపిరి వదిలాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబులెన్స్‌ను కదలనీయకుండా అడ్డుకున్నారు. అప్పటికే అందులో మరో 3 పాజిటివ్ కేసులను ఆస్పత్రికి తరలిస్తున్నందున అంబులెన్స్ వెళ్లేందుకు ఎస్‌ఐ సుమంత్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సకాలంలో అంబులెన్స్ లేదా వలంటీర్లు, సచివాలయం సిబ్బంది చేరుకున్నా బాధితుడి ప్రాణాలు దక్కేవని కుటుంబ సభ్యులు వాపోయారు.