అంబేడ్కర్‌ స్మృతి వనం తరలింపు

ABN , First Publish Date - 2020-07-08T08:35:17+05:30 IST

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతం అమరావతిలోని శాఖమూరులో నిర్మించ తలపెట్టిన అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని ప్రస్తుత

అంబేడ్కర్‌ స్మృతి వనం తరలింపు

  • అమరావతి నుంచి బెజవాడకు
  • స్వరాజ్‌ మైదానంలో నేడు సీఎం శంకుస్థాపన

విజయవాడ/అమరావతి/గుంటూరు/తుళ్లూరు, జూలై 7: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతం అమరావతిలోని శాఖమూరులో నిర్మించ తలపెట్టిన అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని ప్రస్తుత జగన్‌ ప్రభుత్వం విజయవాడకు మార్చింది. ఇక్కడి స్వరాజ్‌ మైదాన్‌లో ‘అంబేడ్కర్‌ ఉద్యానవనం’ పేరుతో నిర్మించనుంది. బుధవారం సీఎం జగన్‌ ఈ ఉద్యానవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాసరావు తదితరులతో కలిసి స్వరాజ్‌ మైదానాన్ని పరిశీలించారు. అనంతరం, మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేందుకు స్వరాజ్‌ మైదాన్‌లో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.


దళిత సంఘాలు, మేధావులు, అభ్యుదయ వాదులు, దళితవర్గానికి చెందిన ఎంపీల వినతి, ప్రజాభీష్టం మేరకే విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న స్వరాజ్‌ మైదానం స్థలాన్ని అంబేడ్కర్‌ ఉద్యానవనం కోసం ఎంపిక చేశామన్నారు. స్వరాజ్‌ మైదాన్‌ పేరును ఇకపై ‘డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌ ఉద్యానవనం’గా పిలవనున్నట్టు చెప్పారు. బుధవారం వైఎస్‌ జయంతిని పురస్కరించుకుని ఈ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టును కేవలం ఏడాదిలోనే పూర్తిచేసి ప్రజలకు అంకితమిస్తామన్నారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో అమరావతిలోని శాఖమూరులో అంబేడ్కర్‌ స్మృతివనం పేరుతో గ్రాఫిక్స్‌ మాయాజాలం చేశారని విమర్శించారు. 


రెండు దశల్లో పూర్తి

అంబేడ్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌ ఉద్యానవనాన్ని రెండు దశల్లో పూర్తి చేస్తామని మంత్రి విశ్వరూప్‌ చెప్పారు. తొలి దశలో 125 అడుగుల ఎత్తైన భారీ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, రెండో దశలో మైదానాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేస్తామన్నారు. అంబేడ్కర్‌ స్మారక కేంద్రం, లైబ్రరీ, అధ్యయన కేంద్రం, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌ను ఇక్కడ నిర్మించనున్నారు. దీనికి ఇరిగేషన్‌ శాఖ అధీనంలో ఉన్న భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు బదలాయించినట్టు మంత్రి తెలిపారు. 

Updated Date - 2020-07-08T08:35:17+05:30 IST