అంబటి రాంబాబుకి కార్యకర్తల వెన్నుపోటు?
ABN , First Publish Date - 2020-09-02T02:05:41+05:30 IST
గుంటూరు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. అంబటి రాంబాబుకు స్వపక్షం నాయకుల నుంచి సెగ తగులుతోంది. ఎమ్మెల్యేపై..

గుంటూరు జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. అంబటి రాంబాబుకు స్వపక్షం నాయకుల నుంచి సెగ తగులుతోంది. ఎమ్మెల్యేపై అసమ్మతి వర్గం కత్తులు దూస్తోంది. అంబటిపై అక్రమ మైనింగ్ ఆరోపణలతో సొంత పార్టీ నేతలే హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు సీఐడీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అధికార పార్టీ నేతలపై కూడా అవే ఆరోపణలు రావడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అంబటిపై సొంత పార్టీలో అసమ్మతి ఎందుకు రేగుతోంది.
ప్రత్యర్థి పార్టీలను మాటలతో ఇరుకున పెట్టే ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుకు ఇంటి పోరు పెరిగింది. సొంత పార్టీ నేతలు ఇస్తున్న షాకులు ఆయనను ఖంగుతినేలా చేస్తున్నాయి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై అక్రమ మైనింగ్ ఆరోపణలతో హైకోర్టులో పిల్ వేయడం పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. రాజపాలెం వైసీపీ కార్యకర్తల తరపున హైకోర్టు న్యాయవాది నాగరఘు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
రాజపాలెం మండలం కోటనెమలిపురి, కొండమూరులో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్‌కు పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు పిటిషన్‌లో తెలిపారు. అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. అయితే సొంత పార్టీ వారే పిటిషన్ దాఖలు చేస్తే అది ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎలా అవుతుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశిస్తూ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.