ఎక్స్‌ప్రెస్‌వే నుంచి అమరావతి ఔట్‌!

ABN , First Publish Date - 2020-03-04T08:46:13+05:30 IST

రాజధాని అమరావతికి మరో షాక్‌ తగిలింది. ప్రతిష్ఠాత్మకమైన అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవే నుంచి అమరావతిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ భారంగా మారిందని...

ఎక్స్‌ప్రెస్‌వే నుంచి అమరావతి ఔట్‌!

  • చిలకలూరిపేట బైపాస్‌ వరకే రహదారి పరిమితం 
  • రాజధానిని తొలగిస్తూ  సర్కారు కీలక నిర్ణయం 
  • భూసేకరణ ఖర్చు భారంగా మారిందని సాకులు 

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతికి మరో షాక్‌ తగిలింది. ప్రతిష్ఠాత్మకమైన అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నుంచి అమరావతిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. భూసేకరణ భారంగా మారిందని, రహదారిని అమరావతి వరకూ తీసుకెళ్లలేమని, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకే పరిమితం చేయాలని సర్కారు దాదాపుగా నిర్ణయం తీసుకుంది. అదే జరిగితే, అప్పుడది అనంతపురం-చిలుకలూరిపేట ఎక్స్‌ప్రె్‌సవే అవుతుంది. రాజధానిని ఇంకా అధికారికంగా తరలించకముందే  కీలకమైన రహదారి ప్రాజెక్టు నుంచి అమరావతిని తొలగించాలన్న ప్రయత్నాలు తుదిశకు చేరుకున్నాయి. మారిన అలైన్‌మెంట్‌ ఆధారంగా భూసేకరణకు సంబంధించి 3డీ నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తోంది.


రాజధాని పరిరక్షణ పేరిట రైతాంగం ఉద్యమాన్ని కొనసాగిస్తూ దాన్ని తీవ్రదశకు తీసుకెళ్తున్న తరుణంలో, రహదారి ప్రాజెక్టులో అమరావతి అన్నదే లేకుండా ప్రయత్నాలు జరుగుతుండటం గమనార్హం. రాయలసీమను అమరావతికి అనుసంధానించాలని గత ప్రభుత్వం అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రె్‌సవేను ప్రతిపాదించింది. రూ.25వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును డిజైన్‌ చే శారు. దీనికి సంబంధించిన రైట్‌ ఆఫ్‌ వే(ఆర్‌ఓడబ్ల్యూ)కు కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల శాఖ(ఎంఓఆర్‌టీహెచ్‌) అనుమతిచ్చింది. భూసేకరణ వ్యయంలో సగం కేంద్రం, మిగతాది రాష్ట్రం భరించేలా విధివిధానాలు ఖరారయ్యాయి. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను ఎంఓఆర్‌టీహెచ్‌ ఆమోదించింది. రహదారి నిర్మాణ బాధ్యతలను ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించింది. భూ సేకరణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే  రెండు రకాల నోటిఫికేషన్లు వెలువడ్డాయి. 


ప్రాజెక్టుపై సర్కారు సమీక్ష 

అనంతపురం-అమరావతి రహదారి ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా... గుంటూరు జిల్లాలో భూసేకరణ కష్టంగా ఉందని, ప్రభుత్వంపై మరింత భారం పడుతుందని అధికారులు నివేదించారు. దీంతో అలైన్‌మెంట్‌ మార్చాలని, చిలకలూరిపేట వరకే రహదారి అనుసంధానం చేయాలని, ఆపై వద్దని స్పష్టంగా ఆదేశించినట్లు తెలిసింది. చిలకలూరిపేట మీదుగా ఎన్‌హెచ్‌-16 వెళ్తోంది. ప్రతిపాదిత ఎక్స్‌ప్రె్‌సవేను అక్కడ నిర్మిస్తున్న బైపా్‌సకు కలుపాలని ఆదేశించారు. అక్కడినుంచి గుంటూరు, విజయవాడకు హైవే ఉంది కాబట్టి, దానికి సమాంతంగా మరో పెద్ద రహదారి నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించినట్లు తెలిసింది.


అనంతపురం ఎక్స్‌ప్రె్‌సవేను చిలకలూరిపేట బైపా్‌సకు కలిపితే, సీమ నుంచి వచ్చే వాహనాలు అక్కడినుంచి నేరుగా ఎన్‌హెచ్‌ 16 ద్వారా విశాఖ వెళ్లవచ్చన్న అంశంపైనా చర్చ సాగినట్లు తె లిసింది. కేంద్రం ఆమోదించిన ఆర్‌ఓడబ్ల్యూ ప్ర కారం అనంతపురం జిల్లా మర్రూరు నుంచి చిలకలూరిపేట, ప్రత్తిపాడు, ఫిరంగిపురం ప్రాంతాల నుంచి తాడికొండ మండలం పెద్దపరిమి దాకా రహదారిని ప్రతిపాదించారు. ఇందులో కర్నూలు, కడప నుంచి కలిసే రహదారులను మినహాయిస్తే కొత్తగా నిర్మించేది 394కి.మీ. మూడు పంటలు పండే ప్రాంతాల్లో భూ సేకరణ ఎప్పటి కీ సజావుగా సాగదు. ప్రభుత్వం ఖరారు చేసే ధరకు భూములు ఇచ్చేందుకు రైతులు సహజంగానే ముందుకురారు.


ఈ అంశాన్ని ప్రాతిపదికగా చూపి, భూసేకరణ ఖర్చు భారీగా పెరిగిపోతుందని సర్కారుకు ఆర్‌అండ్‌బీ నివేదిస్తోంది. దీంతో రహదారి అలైన్‌మెంట్‌, రైట్‌ ఆఫ్‌ వేలో మార్పులు ప్రారంభించిన విషయాన్ని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ధ్రువీకరించారు. ‘అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవే చిలకలూరిపేట వరకే ఉంటుంది. భూ సేకరణకు త్వరలో 3డీ నోటిఫికేషన్‌ ఇవ్వనున్నాం. భూసేకరణ ఖర్చు భారీగా ఉంటోంది’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, అనంత-అమరావతి ఎక్స్‌ప్రె్‌సవేను కుదించడంలో మర్మం ఏమిటని ప్రశ్నలొస్తున్నాయి. రాజధానే ఉండదు కాబట్టి నాలుగు వరసల రహదారి ఎందుకని ప్రభుత్వం భావించిందా... లేక భూసేకరణ వ్యయం నిజంగా భరించలేనంతగా ఉందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి డీపీఆర్‌ పరిశీలిస్తే అసలు విషయం బోధపడుతుంది.


394 కి.మీ. రహదారికి ముందుగానే ఎంత భూమి అవసరమో అంచనా వేశారు. 28వేల ఎకరాలకు సంబంధించిన అంచనాతో భూసేకరణకు రూ.2,500కోట్ల వ్యయం కానుందని లెక్కవేశారు. ఒకవేళ భూసేకర ణ ఖరీదైన ప్రక్రియగా మారితే అదనంగా మరో రూ.200- 500కోట్లు అవసరమవుతాయి. రహదారిని ప్రతిపాదించిందే సీమను రాజధానితో అనుసంధానించడానికి. అలాంటిది ఈ ప్రాజెక్టు నుంచి ఆమరావతిని తీసేయాలని నిర్ణయించడంలోని ఆంతర్యం ఏమై ఉంటుందని చర్చ జరుగుతోంది.

Updated Date - 2020-03-04T08:46:13+05:30 IST