అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ.. హైకోర్టులో వాడివేడిగా వాదనలు

ABN , First Publish Date - 2020-03-12T20:21:34+05:30 IST

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీపై హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి.

అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ.. హైకోర్టులో వాడివేడిగా వాదనలు

అమరావతి: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీపై హైకోర్టు ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి, రైతుల తరపు న్యాయవాది అశోక్ బాన్ వాదనలు వినిపించారు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 107 చట్ట విరుద్ధమని ధర్మాసనానికి విన్నవించారు. సీఆర్డీఏ చట్టంలోని మార్గదర్శకాల మేరకు రాజధాని ప్రాంతంలో నివసిస్తున్న పేదలు, రాజధాని అభివృద్ధి వల్ల ఇళ్లు కోల్పోయిన వారికి మాత్రమే రిజర్వ్ చేసిన 5 శాతం భూమిలో నివాసాలు నిర్మించాలని తెలిపారు. 


పేదలకు నివాస స్థలాలు కేటాయించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. కేవలం నివాసయోగ్యమైన ఇళ్లు మాత్రమే ఇవ్వాలని ఉందన్నారు. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం.. ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని  సీఆర్డీఏ చట్టంలో ఎక్కడా పేర్కొనలేదన్నారు. భూకేటాయింపులు నిబంధనల ప్రకారం ప్రభుత్వం పేదవారికి నివాస స్థలాల కేటాయింపులు జరపవచ్చని తెలిపారు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న సామాజిక అభివృద్ధిలో భాగంగానే ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం అపార్టుమెంట్లు నిర్మించి ఇస్తే తాము ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నామన్నారు. 

Updated Date - 2020-03-12T20:21:34+05:30 IST