రాజధాని రైతుల చేతులకు బేడీలు

ABN , First Publish Date - 2020-10-27T20:46:16+05:30 IST

జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించిన తీరు విమర్శల పాలవుతోంది. రైతులకు బేడీలు వేసి మరీ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు.

రాజధాని రైతుల చేతులకు బేడీలు

గుంటూరు: జిల్లా జైలుకు రాజధాని రైతులను తరలించిన తీరు విమర్శల పాలవుతోంది. రైతులకు బేడీలు వేసి మరీ జైలుకు పోలీసులు తీసుకెళ్లారు. జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఆలపాటి రాజా, టీడీపీ నేతలు పిల్లి మాణిక్యరావు, కోవెలమూడి రవీంద్ర. రాజధాని పరిరక్షణ సమితి కన్వినర్ సుధాకర్ తదితరులు రైతులను పరామర్శించారు. రైతులకు బేడీలు వేయడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కృష్టాయపాలేనికి చెందిన రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరుగురు రైతులను జిల్లా జైలుకు తరలించారు. నరసరావుపేట సబ్ జైలులో మరికొంతమంది ఉన్నారు. 


అసలేం జరిగింది?


అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా రాజధాని రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో రైతులు సర్వమత ప్రార్థనలు చేశారు. ఇతర ప్రాంతాల వారు వస్తే... తమకు తెలియజేయాలని రైతులకు పోలీసులు అదే రోజు తెలియజేశారు. మరోపక్క  పేదలకు ఇళ్ల స్థలాలు, మూడు రాజధానులకు అనుకూలంగా కొంతమంది రైతులు ఆటోలలో రావడంతో కృష్ణాయపాలెం కరకట్ట దగ్గర రాజధాని రైతులు అడ్డుకున్నారు. ఇది కాస్త ఉద్రిక్తతలకు దారి తీసింది. రవి అనే వ్యక్తి రాజధాని రైతులపై ఎస్సీ,ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారు. అయితే తన ఫిర్యాదును వాపసు తీసుకుంటూ రవి లేఖ రాసిచ్చినా... కోర్టులోనే తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. తన ఫిర్యాదులో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ ప్రస్తావన లేకపోయినా అలా కేసు నమోదు చేశారని రవి తెలిపారు. 


పోలీసుల తీరుపై స్థానికులు ఫైర్ అయ్యారు. ఎస్సీలపై కూడా ఎస్సీ, ఎస్టీ ఎట్రాసి కేసులు నమోదు చేయడం విస్మయం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. అది ఎంత వరకు తెలివైన పనో అర్థమవుతూనే ఉందన్నారు. తమపై కేసుల విషయంలో రాజకీయ కోణముందన్న అనుమానాలను రైతులు వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-10-27T20:46:16+05:30 IST