మేం దోషులమా?
ABN , First Publish Date - 2020-04-28T09:38:01+05:30 IST
‘‘కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ పాత కేసులు ఉన్నాయంటూ పోలీసులు ఇళ్లకి వచ్చి ఆడవాళ్లని సైతం స్టేషన్‌కు రమ్మంటున్నారు.

132వ రోజు కొనసాగిన ఆందోళన
పాత కేసులతో వేధిస్తారా?
లాక్‌డౌన్‌లోనూ మహిళలను స్టేషన్‌కు తీసుకు వెళ్తారా?
రాజధాని రైతుల ఆవేదన.. కన్నాను కలిసిన మహిళలు
గుంటూరు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ పాత కేసులు ఉన్నాయంటూ పోలీసులు ఇళ్లకి వచ్చి ఆడవాళ్లని సైతం స్టేషన్‌కు రమ్మంటున్నారు. మేమేమైనా దోషులమా? 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం భూములిచ్చిన మమ్మల్ని సమాజంలో దోషులుగా చిత్రీకరిస్తున్నారు. ఇది సరికాదు’’ అని అమరావతి ప్రాంత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు సోమవారానికి 132వ రోజుకు చేరాయి. అక్రమ కేసులుపెట్టి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారంటూ రాజధాని రైతులు, మహిళలు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.
నిరసనలో భాగంగా అమరావతి మహిళలు సొంతగా తయారు చేసిన మాస్కులను వారికి అం దజేశారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇళ్లలోనే ఉండి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఏదోరకంగా తమను పోలీసులు ఇబ్బందులకు గురిచేసి ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ ఉన్న పరిస్థితిల్లో తాము పిల్లలను చదివించుకోలేక, పెళ్లిళ్లు చేయ్యలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు.
కొనసాగిన నిరసనలు
అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు 29 గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. లాక్‌డౌన్ ఆంక్షలకు లోబడి ఎవరి ఇళ్లలో వారే ఉంటూ నిరసనలు తెలిపారు. ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం కింద రాత్రి 7.30 గంటలకు ఐదు నిమిషాల పా టు విద్యుత్ లైట్లను ఆపి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించారు. మహిళలు సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ మెహందీ పెట్టుకొని నిరసన తెలిపారు.