పోరు ఆపేది లేదు!

ABN , First Publish Date - 2020-04-18T10:31:35+05:30 IST

అమరావతి నుంచే పాలన కొనసాగిస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరు ఆపేది లేదని ఆ ప్రాంత రైతులు తెగేసి చెబుతున్నారు.

పోరు ఆపేది లేదు!

మార్మోగిన అమరావతి నినాదం

122వ రోజూ కొనసాగిన రాజధాని రైతుల దీక్షలు


గుంటూరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): అమరావతి నుంచే పాలన కొనసాగిస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు పోరు ఆపేది లేదని ఆ ప్రాంత రైతులు తెగేసి  చెబుతున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శుక్రవారానికి 122వ రోజుకు చేరాయి. కరోనా నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆంక్షల నడుమ ఎవరి ఇళ్లలో వారు ఉంటూ రైతులు, కూలీలు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తుళ్లూరు, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, రాయపూడి, ఉద్దండరాయుని పాలెం తదితర గ్రామాల్లో మహిళలు, రైతులు ఇళ్లలో కూర్చొని సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు. అలానే మహిళలు మాస్కులు కుట్టి పోలీసులకు, అధికారులకు పంపిణీ చేశారు. రాత్రి అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగించారు.


రాజధానిపై ఆలోచించాలి: ముప్పాళ్ల

అందరి ఆమోదంతోనే నాడు రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని గుర్తించారని దానిని తరలించాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించటం దారుణమని రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రానిక ఏకైక రాజఽధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరులోని వారీ పార్టీ కార్యాలయంలో ఒకరోజు దీక్ష ఆయన చేశారు.   ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ గుంటూరులో  టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ కొమ్మాలపాటి శ్రీధర్‌ శుక్రవారం 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు.

Updated Date - 2020-04-18T10:31:35+05:30 IST