-
-
Home » Andhra Pradesh » amaravathi Coronavirus Janata curfew
-
కర్ఫ్యూలోనూ నిరసన!
ABN , First Publish Date - 2020-03-23T09:50:30+05:30 IST
‘‘అమరావతి ఉద్యమం కరోనా వైర్‌సకి భయపడేది కాదు. కానీ ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూని పాటిస్తున్నాం. మా మతం ప్రజాహితం, మా పోరు భావితరాల భవిష్యత్తు కోసం

ఇళ్ల ముందు ‘జై అమరావతి’ ముగ్గు
రాజధానిగా అమరావతి కొనసాగాలని నినాదం
96వ రోజూ కొనసాగిన రాజధాని ఆందోళనలు
గుంటూరు, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ‘‘అమరావతి ఉద్యమం కరోనా వైర్‌సకి భయపడేది కాదు. కానీ ప్రధాని మోదీ పిలుపుమేరకు జనతా కర్ఫ్యూని పాటిస్తున్నాం. మా మతం ప్రజాహితం, మా పోరు భావితరాల భవిష్యత్తు కోసం’’ అంటూ అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు ఆదివారం 96వ రోజుకు చేరాయి. 3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తుళ్లూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, నీరుకొండ, పెదపరిమి తదితర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు. జనతా కర్ఫ్యూని పాటిస్తూనే అమరావతి రైతులు తమ నిరసనలు కొనసాగించారు. ఉదయం 5.30 గంటలకే రైతులు, రైతుకూలీలు, మహిళలు దీక్షా శిబిరాలకు చేరుకుని దూరం దూరంగా కూర్చొని దీక్షలు చేపట్టారు. మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. బాధ్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వరిస్తామని సరిగ్గా 7 గంటలకు కర్ఫ్యూని పాటిస్తూ ఇళ్లకు వెళ్లారు. అనంతరం తమ ఇళ్లలో నిరసనను కొనసాగించారు. సాయంత్రం 5 గంటలకు రైతులు తిరిగి శిబిరాలకు చేరుకొని వైద్యులు, అధికారులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, మీడియా సేవలను కొనియాడుతూ చప్పట్లు కొట్టి మద్దతు తెలిపారు. మళ్లీ రాత్రి 9 గంటల నుంచి గంటసేపు రైతులు తమ ఆందోళనలు కొనసాగించారు.
ఇంటింటా అమరావతి హోరు
రాజధాని రైతులు తమ పోరు తీరును మార్చారు. ‘ఇంటింటా అమరావతి’ పేరిట ఎవరి ఇంట్లో వారు కుటుంబ సమేతంగా కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలు తమ ఇళ్ల ముందు ‘జై అమరావతి.. జనతా కర్ఫ్యూని విజయవంతం చేయండి’ అంటూ ముగ్గులు పెట్టారు. ప్రతి ఇంటిపైనా నల్లజెండా, రైతుల జెండాను ఎగురవేసి నిరసన తెలిపారు.
‘అమరావతి వెలుగు’
రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల్లోనూ రాత్రి 7.30కు ‘అమరావతి వెలుగు’ పేరిట ఇళ్లలో విద్యుత్తు దీపాలు ఆపేసి రైతులు, మహిళలు కొవ్వొత్తులు వెలిగించారు. ప్రభుత్వం నిర్ణయం మార్చుకొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేవరకు తమ పోరు ఆపబోమని రైతులు, రైతుకూలీలు తేల్చి చెప్పారు. కొందరు తమ ఇళ్ల ముందుకు వచ్చి నిరసన తెలిపారు.