మాకు ఆ పాటి విలువ ఇవ్వరా?!

ABN , First Publish Date - 2020-03-18T09:52:05+05:30 IST

‘‘స్థానిక ఎన్నికలు వాయిదా పడితే వెంటనే మీడియా సమావేశం నిర్వహించారు. తక్షణమే స్పందించారు. 91 రోజులుగా నడిరోడ్డుపై నిలబడి ఆందోళనలు చేస్తున్నా.. రాజధాని విషయంలో మా ఆవేదన

మాకు ఆ పాటి విలువ ఇవ్వరా?!

  • ఎన్నికలు వాయిదా అనగానే మీడియా ముందుకొచ్చారు
  • 3 మాసాలుగా నిద్రాహారాలు మాని రోడ్లపైకొస్తే మాపై జాలేది?
  • సీఎం జగన్‌కు రైతుల సూటి ప్రశ్న
  • 91వ రోజు కొనసాగిన ఆందోళనలు


గుంటూరు, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ‘‘స్థానిక ఎన్నికలు వాయిదా పడితే వెంటనే మీడియా సమావేశం నిర్వహించారు. తక్షణమే స్పందించారు. 91 రోజులుగా నడిరోడ్డుపై నిలబడి ఆందోళనలు చేస్తున్నా.. రాజధాని విషయంలో మా ఆవేదన వెల్లడిస్తున్నా పట్టించుకోవటం లేదు. మాకు ఆ పాటి విలువ కూడా ఇవ్వరా?’’ అని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు సీఎం జగన్‌ను ప్రశ్నించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ మంగళవారం 91వ రోజూ రైతులు, కూలీలు, మహిళలు ఆందోళనలు కొనసాగించారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నా నిర్వహించగా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం తదితర ప్రాంతాల్లో రిలే దీక్షలు, ఆందోళనలు కొనసాగించారు. ‘‘ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. కానీ, నేడు జగన్‌ పుణ్యమా అని పోలీసుస్టేషన్లు, కోర్టులు, జైళ్లు చూడాల్సి వచ్చింది. అయినా భయపడేది లేదు. మా ఆశ, శ్వాస అమరావతే’’ అంటూ మందడం మహిళలు స్పష్టం చేశారు. డ్రోన్‌ కేసు నుంచి బెయిల్‌పై విడుదలైన రైతులు, మహిళలు మంగళవారం దీక్షా శిబిరానికి వచ్చారు. మాచర్లలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేపై దాడి చేసిన కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిలిచ్చారని, న్యాయం కోరుతున్న తమకేమో 23 రోజుల రిమాండా అని నిలదీశారు. అమరావతిని కొనసాగించాలంటూ తుళ్లూరు శిబిరంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.


మాస్కు, స్టిక్కర్లతో నిరసన 

ముఖానికి మాస్కు, నుదుటిపై ‘జై అమరావతి’ స్టిక్కర్లతో రాయపూడి రైతులు, మహిళలు వినూత్న నిరసన తెలిపారు. ఆందోళనకు మాజీ మంత్రులు వడ్డే శోభనాద్రీశ్వరరావు, దేవినేని ఉమ తదితరులు సంఘీభావం తెలిపారు. కరోనా వంకతో పది రోజుల్లో ప్రభుత్వం శిబిరాలను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తోందని జేఏసీ నేత కే.శ్రీనివాస్‌ తుళ్లూరు శిబిరంలో అన్నారు. అదే జరిగితే ఎవరి ఇంటి ముందు వారు ఉద్యమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-03-18T09:52:05+05:30 IST