3 ముక్కలాటను 13 జిల్లాలూ నిరసించాలి
ABN , First Publish Date - 2020-08-22T09:31:05+05:30 IST
వైసీపీ ప్రభుత్వం స్కీముల ముసుగులో స్కాములకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ..
శంకుస్థాపనలో ప్రతిజిల్లానుంచీ నీరు, మట్టి
అందుకే అసెంబ్లీ రద్దుకు ముందుకురాలేదు
అమరావతితోనే వృద్ధి, వికేంద్రీకరణ: చంద్రబాబు
రాజధాని రైతుల 250వరోజు నిరసనలకు మద్దతు
రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సీపీఐ సంఘీభావం
అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): అమరావతి జేఏసీ చేపట్టిన ఆందోళన 250వ రోజుకు చేరిన సందర్భంగా, జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొని రాజధానికి వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులకు అండగా నిలవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మూడు ముక్కలాటను రాష్ట్రంలోని మొత్తం 13 జిల్లాల ప్రజలు నిరసించాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అమరావతి రైతులకు, మహిళలకు సంఘీభావం తెలపాలని ఆయన కోరారు. రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని తాము చేసిన డిమాండ్‌కు వైసీపీ ముందుకు రాకపోవడాన్ని బట్టే, ఆ నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేదని తేటతెల్లమైందన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్నందువల్ల అమరావతిని స్వాగతిస్తున్నానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరించడం గర్హనీయమని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఆంధ్రప్రదేశ్ కోసమే అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగమే అమరావతి అనేది రుజువైంది. రాష్ట్రంలో ప్రజలందరి ఆమోదంతో పదమూడు వేలగ్రామాలు, మూడు వేల వార్డుల్లో పవిత్ర మట్టి, పుణ్య జలాలను ఊరేగింపుగా తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశామని మరచిపోరాదు’’ అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాల అభివృద్ధిని కొనసాగించాలి తప్ప నాశనం చేయడం సరైంది కాదని, ఆ హక్కు ఎవరికీ లేదన్నారు.
కేంద్రం, రాష్ట్రం కలిసి దగా చేస్తున్నాయి: రామకృష్ణ
250 రోజులకు చేరువవుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమానికి సీపీఐ మద్దతు ప్రకటించింది. ‘రాజ్యాంగాన్ని పరిరక్షించాలి..అమరావతినే రాజధానిగా కొనసాగించాలి’ అని కోరుతూ అమరావతి జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు సంఘీభావం తెలుపుతున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అన్ని పార్టీలు అంగీకరించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే రాజధాని అంశంలో ప్రజలను దగా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
‘రాజధానుల’పై ప్రభుత్వానికి మద్దతు లేదు
స్కీములంటూ స్కాములు
చంద్రబాబు ఆగ్రహం.. అమరావతి రైతులకు సంఘీభావం
రేపు అన్ని గ్రామాల్లో నిరసనలు.. మాజీ సీఎం పిలుపు
అమరావతి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం స్కీముల ముసుగులో స్కాములకు పాల్పడుతోందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన తమ పార్టీ మండల స్ధాయి నాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లలో మాట్లాడారు. ట్విటర్‌లోనూ స్పందించారు. ‘మద్యంలో సొంత బ్రాండ్లు తెచ్చారు. ప్రతి బాటిల్‌పై కమీషన్లు వసూలు చేస్తూ పేదలను దోచుకుంటున్నారు. ఇసుకను బంగారం మాదిరిగా మార్చి సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారు. ఇళ్ల స్థలాలకు భూ సేకరణలో కుంభకోణాలు.. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి కమీషన్లు వసూలు చేస్తూ పేదలను పీక్కుతింటున్నారు. ప్రభుత్వ ఖజానాను అయినకాడికి దోచుకుంటున్నారు’ అని ఆయన విమర్శించారు. కరోనా సమయంలో ప్రపంచం మొత్తం వైద్యులకు నీరాజనాలు పలుకుతుంటే ఇక్కడ మాత్రం వారిని కనీవినీ ఎరుగని రీతిలో వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. రోజుకు పది వేల కరోనా కేసులు వస్తుంటే దానిని అదుపు చేయాల్సింది పోయి ఈ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో మునిగి తేలుతోందని విమర్శించారు.
కరోనాని వ్యాప్తి చేయడమే జగన్ ఇప్పటి వరకు చేసిన వికేంద్రీకరణ అని ఎద్దేవా చేశారు. అమరావతి జేఏసీ ఆందోళనలు 250 రోజులకు చేరిన సందర్భంగా ఆదివారం వారికి సంఘీభావంగా నిరసనలు తెలపాలని పిలుపిచ్చారు. సీఎం జగన్ ఐరన్ లెగ్‌గా మారారని, ఆయన శ్రీశైలం వెళ్లాలనుకోగానే అక్కడ అగ్నిప్రమాదం జరిగి తొమ్మిది మంది చనిపోయారని కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు టెలికాన్ఫరెన్స్‌లో విమర్శించారు. గోదావరి వరద బాధితులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. ‘మీ నాయకుడికి దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న వారితో రాజీనామా చేయించి వలంటీర్లని పోటీలో పెట్టండి లేదా మీ పులివెందుల పిల్లిని పోటీకి దిగినా ఓకే..’ అని ట్విటర్‌లో అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాల జోలికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు.