మద్యం ఆదాయమే దిక్కు

ABN , First Publish Date - 2020-12-11T07:51:30+05:30 IST

మద్యంపై వచ్చే ఆదాయంతో అప్పు తీరుస్తాం అన్నారంటే...మద్యపాన నిషేధం లేదా? అధికారానికి వచ్చిన నాలుగేళ్లలో మద్యపాన

మద్యం ఆదాయమే  దిక్కు

25వేల కోట్ల బ్యాంకు అప్పునకు ‘అదే’ హామీ 

నిషేధం ఎత్తేస్తే ప్రజల మెడపై కొత్త పన్ను

ప్రభుత్వ ఆస్తుల్లో కొంతభాగం తాకట్టు!

రాష్ట్రాన్ని అమ్మైనా కట్టాల్సిందే అన్నట్టు షరతులు

అప్పుకోసం అన్నింటికీ సరేనన్న ప్రభుత్వం

ఇప్పటికే తెచ్చేసి ఖర్చు చేస్తున్న వైనం


రూ.25వేల కోట్ల అప్పా. సరే ఇస్తాం. మరి ఎలా తీరుస్తారు? 

మద్యంపై 36 శాతం అదనపు పన్ను వేశాం. దాని నుంచి వచ్చే ఆదాయంతో తీర్చేస్తాం.

 

మరి మద్యనిషేధం అంటున్నారుగా! దాని సంగతేంటి? 

ఒకవేళమద్యనిషేధం అమలుచేస్తే ఒక కొత్త పన్ను వేస్తాం. ఆ పన్ను ఆదాయంతో మీ అప్పు తీర్చేస్తాం. ఇంకా ఏదైనా ఇబ్బంది వస్తే ప్రభుత్వ ఆస్తుల్లో కొంతభాగం తాకట్టు పెడతాం. ఆస్తులు అమ్మైనా అప్పు తీర్చేస్తాం... 

ఈ హామీతోనే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల నుంచి రూ.25వేల కోట్ల అప్పు తీసుకుంది.  అయితే ఈ అప్పు తెచ్చేందుకు  ఇచ్చిన వాగ్దానాలే పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మద్యంపై వచ్చే ఆదాయంతో అప్పు తీరుస్తాం అన్నారంటే...మద్యపాన నిషేధం లేదా? అధికారానికి వచ్చిన నాలుగేళ్లలో మద్యపాన నిషేధం అమలుచేస్తామని వైసీపీ ఎన్నికలప్పుడు చెప్పింది. ఇప్పటికే ఏడాదిన్నర పూర్తికాగా, మరో రెండున్నరేళ్లలో మద్య నిషేధం అమలుచేయాల్సి ఉంది. అయితే తాజాగా తెచ్చిన రూ.25వేల కోట్ల అప్పు తిరిగి చెల్లించేందుకు ఇదే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం హామీగా చూపింది. అప్పుగా తెచ్చిన డబ్బులో చాలా భాగం సంక్షేమ పథకాలకు మళ్లిస్తుండడంతో, అక్కడి నుంచి మళ్లీ ఆదాయం వచ్చే అవకాశం లేదు. దీంతో మద్యం ఆదాయం నుంచే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇంత భారీ అప్పు, దానికి వ డ్డీ కలిపి తీర్చాలంటే కనీసం ఐదేళ్లు పడుతుందని అంటున్నారు.


మరి ఐదేళ్లపాటు అంటే మద్యపాన నిషేధం సంగతి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానం బ్యాంకర్లకూ వచ్చింది. అదే అడిగితే, కచ్చితంగా మద్యపాన నిషేధం పెడతామని ప్రభుత్వం చెప్పలేదు. కానీ, ఒక బాంబు మాత్రం పేల్చింది. ఒకవేళ మద్యపాన నిషేధం పెడితే...ఒక కొత్త పన్ను వేసి అప్పు తీరుస్తామంది. అంటే ఇప్పుడున్న పన్నులకు తోడు మరిన్ని పన్నుల భారాలకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలన్న మాట. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి హామీగా చూపించింది. జీవోఎంఎస్‌ నెం.90, 92, 93లలో ఈ విషయాలను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. బ్యాంకర్లకు ఏం కావాలంటే అది హామీగా ఇవ్వాలి, ఎలాగైనా అప్పుతేవాలి, అన్నట్లుగా హామీలిచ్చి ఆ మేరకు అప్పు తెచ్చేసింది. 


ఐదు జిల్లాల మద్యం ఆదాయం హామీ..

ఐదు జిల్లాల్లోని 10 మద్యం డిపోల అమ్మకాల నుంచి వచ్చే అదనపు ఎక్సైజ్‌ పన్ను ఆదాయాన్ని అప్పు చెల్లింపు కోసం మళ్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు మద్యంపై దాదాపు 36శాతం ఈ అదనపు ఎక్సైజ్‌ పన్నును విధించారు. దీంతో మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లోని డిపోల నుంచి వచ్చే ఈ అదనపు పన్ను ఆదాయాన్ని ఎస్ర్కో ఖాతాకు మళ్లిస్తారు. అక్కడినుంచి అప్పులిచ్చిన బ్యాంకర్లకు చెల్లింపులు జరుగుతాయి. 


ఆదాయ మార్గం లేదు..పన్నులతో తీర్చాల్సిందే..

ప్రభుత్వం ఒకేసారి ఇంత భారీగా తెచ్చిన అప్పును ఎక్కడ ఖర్చుపెడుతోందన్నది కూడా విమర్శలకు తావిస్తోంది. ఏపీ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ పేరుమీద అప్పు తెస్తున్నా, ఈ అప్పుతో చేసే అభివృద్ధి మాత్రం ఏమీ లేదని అంటున్నారు. తిరిగి ఆదాయం సంపాదించే ప్రాజెక్టులపై ఈ డబ్బు ఖర్చు చేయడం లేదు. ఈ అప్పులో అత్యధిక భాగాన్ని సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చుచేస్తున్నారు. ఆదాయం పెరిగే పనులను ప్రభుత్వం చేస్తోందా? అంటే అదీ లేదనే విశ్లేషకులు చెప్తున్నారు. ప్రభుత్వ వ్యవహారశైలి, వివాదాస్పద నిర్ణయాల వల్ల ఎక్కడా ఆదాయం పెరిగే మార్గాలు కనిపించడం లేదు. దీంతో పన్నులు పెంచడం, కొత్త పన్నులు వేయడం అన్న మార్గాలే ఆదాయం పెంపునకు కనిపిస్తున్నాయి. పన్నుల ఆదాయాన్ని చూపించి అప్పులు తేవడం, మళ్లీ ఆ అప్పు తీర్చడానికి అదనంగా మరిన్ని పన్నులు వేయడం అన్నట్లుగానే ప్రభుత్వం నడుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2020-12-11T07:51:30+05:30 IST