కార్పొరేట్ల కోసమే వ్యవసాయ బిల్లులు
ABN , First Publish Date - 2020-10-03T07:14:19+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రెండు కోట్ల
రెండు కోట్ల సంతకాల సేకరణకు శ్రీకారం
హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం జగన్ రాజీనామా చేయాలి
శైలజానాథ్, తులసిరెడ్డి వ్యాఖ్యలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ రాష్ట్ర నేతలు ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రెండు కోట్ల సంతకాలు సేకరించాలని ఏపీసీసీ నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విద్యుత్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, జగన్ వాటిని పెడితే... తాము పీకేస్తామని హెచ్చరించింది. విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాల్లో మహాత్మాగాంధీ, లాల్‌బహదుర్ శాస్త్రికి ఘనంగా నివాళులర్పించింది.
శుక్రవారం విశాఖలో నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ మాట్లాడుతూ ‘‘కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే ప్రధాని మోదీ రైతు వ్యతిరేక బిల్లులను తీసుకువచ్చారు. రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపించేలా తీసుకొచ్చిన మూడు బిల్లులను ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుంది’’ అని అన్నారు.
అనంతపురం, ధర్మవరంలో ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో పాలన ఏ తీరుగా నడుస్తోందో హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలతో తేలిపోయింది. ఇందుకు బాధ్యత వహిస్తూ సీఎం జగన్ రాజీనామా చేయాలి. లేకుంటే రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని అన్నారు. దేశం, రాష్ట్రంలో దుష్మన్ పార్టీలే రాజ్యం ఏలుతున్నాయన్నారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగాధర్ నేతృత్వంలో రైతులు, వ్యవసాయ కూలీల నుంచి కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2కోట్ల సంతకాల సేకరణకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది.