పోరు ఆగదు!
ABN , First Publish Date - 2020-04-05T09:06:17+05:30 IST
రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ పోరు ఆగదని రైతులు, రైతు కూలీలు, మహిళలు నినదించారు. ‘‘బతుక్కి భద్రత లేనప్పుడు ఊళ్లో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే.. ఎన్ని ఆంక్షలైనా పెట్టుకోండి.

- 109వ రోజు కొనసాగిన రాజధాని రైతుల ఆందోళన
- మార్మోగిన అమరావతి నినాదం
- ఎమ్మెల్యే పర్యటనపై ఫైర్
గుంటూరు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): రాజధానిగా అమరావతిని ప్రకటించే వరకు తమ పోరు ఆగదని రైతులు, రైతు కూలీలు, మహిళలు నినదించారు. ‘‘బతుక్కి భద్రత లేనప్పుడు ఊళ్లో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే.. ఎన్ని ఆంక్షలైనా పెట్టుకోండి. ఊపిరి ఉన్నంత వరకు అమరావతి కోసం పోరు ఆపేది లేదు’’ అని స్పష్టం చేశారు. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమం శనివారానికి 109వ రోజుకు చేరింది. నీరుకొండ, పెదపరిమి, రాయపూడి దీక్షా శిబిరాల్లో రైతులు భౌతికదూరం పాటిస్తూ మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతవరం, నెక్కల్లు, వెలగపూడి, మందడం, అబ్బురాజు పాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం తదితరాల గ్రామాల్లో మహిళలు ఇళ్ల వద్దే నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేను కలవనివ్వని పోలీసులు
రాజధాని కోసం భూములిచ్చి 109 రోజులుగా రోడ్డున పడి గగ్గోలు పెడుతుంటే కనీసం తొంగి చూడని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి నేడు ఎందుకు వచ్చారని తుళ్లూరు రైతులు ప్రశ్నించారు. కరోనా నియంత్రణలో భాగంగా ఆశావర్కర్లు, పారిశుధ్య కార్మికులకు శనివారం ఎమ్మెల్యే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ దశలో ఎమ్మెల్యేని కలిసి వినతి పత్రం ఇస్తామని స్థానిక సీఐ శ్రీహరిని దళిత జేఏసీ నేత బసవయ్య అభ్యర్థించారు. అయితే, ఆయన అనుమతి నిరాకరించారు. దీంతో దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీదేవి ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన విందుకు హజరయ్యారన్న ఆరోపణలు ఉన్నాయని, అలాంటి సమయంలో ఎటువంటి పరీక్షలు చేయించుకోకుండా తుళ్లూరు ఎలా వస్తారని నాయకులు ప్రశ్నించారు. ఆమె పర్యటనతో తుళ్లూరు గ్రామం పోలీసు వలయంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశాభివృద్ధికి అమరావతి ఆశాకిరణంగా నిలుస్తుందంటూ రాజధాని రైతులు ‘అమరావతి వెలుగు’ కార్యాక్రమాన్ని శనివారం కొనసాగించారు. రాత్రి 7.30 నుంచి 7.35 వరకు ఇళ్లలో విద్యుత్‌ను నిలిపివేసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన చేపట్టారు.