మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయండి

ABN , First Publish Date - 2020-03-18T09:00:25+05:30 IST

‘‘స్థానిక ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఎన్నో అరాచకాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు చోటుచేసుకొన్నాయి. నోటిఫికేషన్‌ వచ్చిన ఐదు రోజుల్లోనే శాంతిభద్రతలని వైసీపీ ప్రశ్నార్థకం చేసింది. ఎన్నికల వాయిదాతో వ్యవధి

మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయండి

  • వాయిదాతో మరిన్ని ఘటనలు జరిగే అవకాశం
  • టీడీపీ ప్రజాప్రతినిధులు

మంగళగిరి, మార్చి 17: ‘‘స్థానిక ఎన్నికల్లో ఇప్పటి వరకూ ఎన్నో అరాచకాలు, బెదిరింపులు, దౌర్జన్యాలు చోటుచేసుకొన్నాయి. నోటిఫికేషన్‌ వచ్చిన ఐదు రోజుల్లోనే శాంతిభద్రతలని వైసీపీ ప్రశ్నార్థకం చేసింది. ఎన్నికల వాయిదాతో వ్యవధి పెరుగుతుంది. అలాంటి సంఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్‌ తక్షణమే స్పందించి మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలి’’ అని టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన ఏకగ్రీవాల శాతాన్ని, నేడు అయిన ఏకగ్రీవాలను ఏకరువు పెట్టారు. ఆంధ్రలో నమోదవుతున్న కరోనా కేసుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందన్నారు. అంతర్వేదిలో మహిళ కరోనాతో చనిపోతే మెదడువాపు వ్యాధి అని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. కరోనా మరణాలు సంభవిస్తే సీఎం, సీఎ్‌సలదే బాధ్యత అని నిమ్మల స్పష్టం చేశారు. సీఎం జగన్‌ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. వాయిదా విషయం కనీసం సీఎ్‌సకు కూడా చెప్పలేదని జగన్‌ అనడాన్ని తప్పుపట్టారు. ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం శ్రద్ధలేదని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. ఎన్నికల సంఘాన్ని వైసీపీ తప్పు పట్టడం సిగ్గుచేటని మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా అధికారుల సంఘం వ్యవహరించకూడదని ఎమ్మెల్సీ చెంగల్రాయుడు అన్నారు.


కేంద్రనిధులు ఆగవు: యనమల స్పష్టీకరణ

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన నిధులు ఆగవని.. వస్తూనే ఉంటాయని ఆర్థిక శాఖ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు,  ఆ నిధులకు సంబంధమే లేదని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహిస్తేనే ఈ నిధులు ఇస్తామని కేంద్రం ఎక్కడా చెప్పలేదని వెల్లడించారు. మంగళగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘కరోనా ప్రభావం వల్ల ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దానిని భరించలేక నిధుల సాకు చూపించి టీడీపీని దోషిగా చూపించాలని వైసీపీ నేతలు తాపత్రయపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాయడం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా తప్పు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు సీఎంతోపాటు సీఎ్‌సకూ ఎలాంటి అధికారాలు ఉండవు. కమిషనర్‌పై ఒత్తిడి తేవాలని చూడడం ద్వారా ఆమె కూడా తప్పు చేశారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల సర్వీసు నిబంధనలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది. రాష్ట్రంలో కొందరు అధికారులు, పోలీసు వ్యవస్థ కలిసి ప్రతిపక్షాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అధికారుల వివరాలు సేకరించి కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు పంపుతున్నాం. ప్రతిపక్షంపై ఒంటికాలిపై లేస్తున్న ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టేది లేదు’ అని ఆయన తేల్చిచెప్పారు. 

Updated Date - 2020-03-18T09:00:25+05:30 IST