-
-
Home » Andhra Pradesh » Actions on garbage work
-
‘చెత్త’పనిపై చర్యలు
ABN , First Publish Date - 2020-12-28T08:06:28+05:30 IST
చెత్త పనులపై చర్యలు మొదలయ్యాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశరావుపై సస్పెన్షన్ వేటుపడింది.

- ఉయ్యూరు కమిషనర్‌పై వేటు
- కేంద్రం కన్నెర్రతో సర్కారులో కదలిక
- విజయవాడ, బందరు కమిషనర్లకు
- మున్సిపల్ ముఖ్యకార్యదర్శి నోటీసు
- ఉత్తర్వుల్లో ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావన
విజయవాడ, అమరావతి, తిరుపతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): చెత్త పనులపై చర్యలు మొదలయ్యాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ప్రకాశరావుపై సస్పెన్షన్ వేటుపడింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రుణాలు ఇవ్వడం లేదంటూ బ్యాంకుల ఎదుట చెత్తను డంపింగ్ చేయించిన వ్యవహారంలో ఆయనపై ఈ చర్య తీసుకొన్నారు. ఈ మేరకు ఆదివారం మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి విజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఇదే వ్యవహారంలో విజయవాడ మున్సిపల్ కమిషనర్ వి.ప్రసన్నవెంకటేశ్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ ఎస్.శివరామకృష్ణలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల్లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాల గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం. ఈనెల 24న కృష్ణా జిల్లాలోని 16 బ్యాంకుల ముందు చెత్తను వాహనాల్లో తీసుకొచ్చి డంపింగ్ చేశారు .వైఎస్ జగనన్న చేదోడు, పీఎం స్వానిధి పథకాలకు రుణాలు ఇవ్వనందుకే చెత్తను డంపింగ్ చేసినట్టు ఉయ్యూరులో ఏకంగా మున్సిపల్ కమిషనర్ పేరుతోనే బోర్డును బ్యాంకు గేటుకు వేలాడదీశారు. మచిలీపట్నంలో ట్రాక్టర్‌లో తెచ్చిన చెత్తను ఒక రోజంతా బ్యాంకు ముందే ఉంచారు. ఈ ఘటనలపై బ్యాంకు అధికారులు, ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెత్తపోసే ఫొటోలను ట్విట్టర్‌లో కేంద్ర ఆర్థిక శాఖకు, బ్యాంకుల ఉన్నతాధికారులకు ట్యాగ్ చేశారు. దీనిపై కేంద్రం సీరియ్‌సగా స్పందించింది. హుటాహుటిన ఈ ఘటనలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇలా అన్ని వైపుల నుంచీ వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలను చల్లబరిచేందుకుగాను పురపాలక శాఖ శనివారం ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమించింది.
తొలుత ఉయ్యూరులో విచారణ నిర్వహించిన ఈ కమిటీ అక్కడి ఉదంతాలకు ఆ నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాశరావును బాధ్యుడిగా గుర్తిస్తూ, పై అధికారులకు తన నివేదికను సమర్పించింది. ఈ నివేదికతోపాటు ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనాలను కూడా పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకున్నట్లు ‘సస్పెన్షన్’ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మూడురోజుల సెలవు అనంతరం బ్యాంకులు సోమవారం పునఃప్రారంభమవుతాయి. బాధ్యులైన మున్సిపల్ అధికారులపై చర్యల ద్వారా కేంద్ర ఆర్థిక శాఖ, బ్యాంకర్లు, ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని అప్పటికి కొంతైనా చల్లార్చాలనే తాజా ఉత్తర్వులను సెలవు రోజు అయినా ఆదివారమే వెలువరించినట్టు భావిస్తున్నారు.
పునరావృతం కాదు...బ్యాంకర్లకు కృష్ణా కలెక్టర్ హామీ
బ్యాంకులముందు చెత్తవేసిన మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని బ్యాంకర్లకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హామీ ఇచ్చారు. ఉయ్యూరు మున్సిపాలిటీతో పాటు మరో రెండు చోట్ల బ్యాంకుల ముందు చెత్త పోసిన వ్యవహారంపై కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఈ నెల 24న లేఖ రాశారు. ఈ లేఖపై తాజాగా కలెక్టర్ స్పందించారు. ‘‘బ్యాంకుల ముందు చెత్త వేయడం దురదృష్టకర ఘటన. విషయం తెలిసిన కొన్ని నిమిషాల్లోనే వాటిని తొలగించాం. దీనిపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదించాం. బాఽధ్యులైన మున్సిపల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటిఘటనలు ఇక జరగనీయం’’ అని పేర్కొన్నారు.
క్షమించండి: ఉయ్యూరు పంచాయతీ కమిషనర్
‘‘ఇది బాధాకరం. మనోభావాలు దెబ్బతిన్న బ్యాంకు అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు క్షమాపణ చెబుతున్నా. బాధ్యులను గుర్తించి చర్యలుతీసుకుంటాం’’ అని సస్పెన్షన్‌కు గురైన ఉయ్యూరు పంచాయతీ కమిషనర్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వానికిగానీ, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌కు, ఆరోగ్య శాఖకు గానీ ఏవిధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఆయన మీడియాతో మాట్లాడిన కాసేపటికే సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.
మాకు సంబంధం లేదు: నారాయణస్వామి
రుణాలివ్వలేదని బ్యాంకుల ముందు చెత్త పోయించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తిరుపతిలో అన్నారు. ‘‘బ్యాంకర్ల మనసు దోచుకున్న జగన్ ప్రభుత్వానికి ఇలాంటి చెత్తపనులు చేయించాల్సిన అవసరం లేదు. అవినీతిలేని రాజ్యాన్ని తీసుకొచ్చారని మేం చెబుతుంటే, ఆ మాటలను కొన్ని చానళ్లు వక్రీకరించి ప్రసారం చేస్తున్నాయి. ఒక దళితుడికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం కొంతమందికి ఇష్టంలేదు. నాతోపాటు మంత్రి పెద్దిరెడ్డిపై కొన్ని చానళ్లు అనవరసమైన రాద్ధాంతం చేస్తున్నాయి. ఇది ఎంతదూరం పోతుందో అర్థంకావడంలేదు’’ అని నారాయణస్వామి అన్నారు. తిరుమల కొండపై క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి సమర్థించుకొన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొందని, ఈక్రమంలోనే తిరుమలలో వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపానని వివరించారు. ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం జగన్ ఇంట్లో కుక్కలకు కూడా సరిపోదన్న సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. ‘‘కుక్కలు అరిచినట్లు అరిచే నాయకులు చాలామంది ఉన్నారు. ఆ కుక్కలు ఇంతకాలం ఇళ్లు ఇవ్వకుండా ఏమి చేస్తున్నాయి’’ అని ప్రశ్నించారు. విపక్ష నేత చంద్రబాబుకు కూడా ఇల్లు కావాలంటే అర్జీ పెట్టుకుంటే పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. కాగా, చంద్రబాబుతో కుమ్మక్కై ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని సీపీఐ నేత నారాయణపై మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.
