ఆ చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు!

ABN , First Publish Date - 2020-11-25T08:46:03+05:30 IST

చట్టబద్ధత లేని కమిటీలిచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను రూపొందించజాలదని.. ఆ చట్టాలు చేసే అధికారమే దానికి లేదని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితేశ్‌ గుప్తా స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం మూడు

ఆ చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు!

రాజ్యాంగ విరుద్ధంగా 3 రాజధానులపై చట్టం

అమరావతిలో హైకోర్టుపై రాష్ట్రపతి ఉత్తర్వులు

దానిని మార్చే అధికారం రాష్ట్ర సర్కారుకు లేదు

సీనియర్‌ న్యాయవాది నితేశ్‌ గుప్తా నివేదన

నేడూ కొనసాగనున్న వాదనలు


అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి):  చట్టబద్ధత లేని కమిటీలిచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను రూపొందించజాలదని.. ఆ చట్టాలు చేసే అధికారమే దానికి లేదని  సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితేశ్‌ గుప్తా స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానుల విషయంపై చట్టం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమైన మార్గాలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అధికారం కేంద్రప్రభుత్వానికే ఇచ్చారని, ఆ మేరకే శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకే చట్టబద్ధత ఉంటుంది తప్ప, ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌ రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ), మంత్రులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీలకు చట్టబద్ధత గానీ, విలువ గానీ లేవన్నారు. రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ ధర్మాసనం రోజువారీ తుది విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజధాని రైతులు ఇడుపులపాటి రాంబాబు, ఎన్‌.రామకృష్ణ తదితరుల తరఫున గుప్తా మంగళవారం వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారం కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుందని, అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం తీసుకొచ్చారని పేర్కొన్నారు.


‘ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ‘ఏక రాజధాని’ గురించి స్పష్టంగా ఉంది. బహుళ రాజధానుల ప్రస్తావన మాత్రం లేదు. అంటే శాసనకర్తల ఉద్దేశం ‘ఒక్క రాజధాని’ మాత్రమే. విభజన చట్టంలోని సెక్షన్‌ 94 ప్రకారం కొత్తగా ఏర్పాటయ్యే ఆంధ్రప్రదేశ్‌లో రాజ్‌భవన్‌, హైకోర్టు ఒక్కొక్కటేనని పేర్కొన్నారు’ అని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రస్తుత ప్రభుత్వం ముందుగానే నిర్ణయించుకుందని, ఆ తర్వాతే కమిటీలను ఏర్పాటు చేసిందని వ్యాఖ్యానించారు. ముందుగా సీఎం అసెంబ్లీలో ప్రకటన చేయడం, అవే విషయాలు కమిటీల నివేదికల్లో ఉండడాన్ని పరిశీలిస్తే ఇట్లే అవగతమవుతుందన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్రప్రభుత్వం అభీష్టం మేరకే జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ, ఉన్నత స్థాయి కమిటీలు నివేదికలిచ్చాయని తెలిపారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటుపై సాక్షాత్తూ రాష్ట్రపతే నోటిఫై చేశారని, అందువల్ల దానిని మార్చే అధికారం ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రప్రభుత్వానికి ఉండదని తేల్చిచెప్పారు.


ప్లాట్లు ఎలా ఇస్తారు?

సీఆర్‌డీఏ చట్టంలోని 9వ చాప్టర్‌లోని నిబంధనలు రాజధానికి భూములిచ్చిన రైతుల హక్కులను సంరక్షిస్తున్నాయని గుప్తా పేర్కొన్నారు. ఆ చట్టంలోని నిబంధనలు అమలు చేయకుండా రాష్ట్రప్రభుత్వం తప్పించుకోజాలదన్నారు. ‘రాజధాని రైతులకు, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సీఆర్‌డీఏ చట్ట నిబంధనలను అమలు చేయాల్సిందే. రైతుల హక్కులను హరించే అధికారం ప్రభుత్వానికి లేదు. సీఆర్‌డీఏను రద్దు చేసి దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఏఎంఆర్‌డీఏ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను ఇస్తామంటున్నారు.


ముందస్తు మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయకుండానే, కేవలం అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇస్తామని చెప్పడం నిబంధనలకు విరుద్ధం. రైతులతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. అధికారంలో ఎవరున్నా ‘రాష్ట్రం’ ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే. దాని నుంచి తప్పించుకోవడానికి చట్టనిబంధనలు అనుమతించవు’ అని స్పష్టం చేశారు. గుప్తా వాదనలు మంగళవారం పూర్తి కాకపోవడంతో వాటిని కొనసాగించేందుకు విచారణ బుధవారానికి వాయిదా పడింది.

Read more