చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకునే కుట్ర: అచ్చెన్నాయుడు

ABN , First Publish Date - 2020-05-25T04:26:59+05:30 IST

సోమవారం విశాఖపట్నం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను..

చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకునే కుట్ర: అచ్చెన్నాయుడు

అమరావతి: సోమవారం విశాఖపట్నం పర్యటనకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడం వైసీపీ ప్రభుత్వ కుట్రగా టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయడు ధ్వజమెత్తారు. సోమవారం ఒక్కరోజే ఏపీకి విమాన సర్వీసులు బంద్ చేయడం వైసీపీ కుట్రలో భాగమేనని ఆయన మండిపడ్డారు. ఒక్కరోజే విశాఖ, విజయవాడ ఎయిర్ పోర్టుల మూత వేయడం, మళ్లీ మంగళవారం సర్వీసులు ఉన్నాయని చెప్పడం దీనికి బలం చేకూరుస్తోందని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.  


చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించాకే ఏపీకి విమాన సర్వీసుల బంద్ చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌పురి ట్వీట్ దీనికి ప్రత్యక్ష రుజువని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వ అభ్యర్దన మేరకే సర్వీసులు రద్దు చేశామని హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారని, 26వ తేదీకే ఏపీకి పరిమిత సర్వీసులని కేంద్రమంత్రి చెప్పారని అచ్చెన్నాయుడు తెలిపారు. తమిళనాడులో చెన్నైకి గరిష్టంగా 25 సర్వీసులు నడుపుతున్నట్లు, దేశంలో ఇతర ఎయిర్ పోర్టుల తరహాలోనే తమిళనాడులో ఇతర ఎయిర్ పోర్టులకు సర్వీసులు ఉంటాయని హర్దీప్ సింగ్‌పురి ఆ ట్వీట్ లో పేర్కొన్నారని ఆయన తెలిపారు.


‘‘చంద్రబాబు విశాఖ ఎప్పుడు వచ్చినా వైసీపీకి భూకంపం వచ్చినట్లు ప్రవర్తిస్తోంది. చంద్రబాబు అంటే వైసీపీ నాయకుల్లో ఉన్న భయాన్ని ఈ విధమైన చేష్టలు రుజువు చేస్తున్నాయి. ఈ రోజు విశాఖ వెళ్లకుండా ఆపగలిగినా విశాఖ వాసుల మనుసులలోనుంచి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని చెరిపేయడం వైసీపీ నాయకులకు అసాధ్యం అనేది గుర్తుంచుకోవాలి. త్వరలోనే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి  బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారు’’. అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2020-05-25T04:26:59+05:30 IST