అదుపులో ‘గుళ్ల’ నిందితులు

ABN , First Publish Date - 2020-09-29T07:52:24+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలి కాలంలో 19 దేవాలయాలపై దాడులకు పాల్పడిన 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. అయితే ఈ

అదుపులో ‘గుళ్ల’ నిందితులు

19 దాడుల్లో 12 మంది పాత్ర

ఒకదానికొకటి సంబంధం లేదు: డీజీపీ


అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలి కాలంలో 19 దేవాలయాలపై దాడులకు పాల్పడిన 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. అయితే ఈ దాడుల ఘటనలకు ఒకదానితో మరొక దానికి సంబంధం లేదని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఆలయాల్లో విగ్రహాల ధ్వంసానికి, నగలు మాయం కావడానికి నమ్మకాలు, దొంగలు, ప్రకృతి విపత్తులు కారణం. శ్రీకాకుళంలో వర్షాల కారణంగా దేవుడి విగ్రహానికి చేయి విరిగింది. కర్నూలులో దేవతా మూర్తి విగ్రహాల భాగాలను దొంగలించడానికి పిల్లలు లేని వ్యక్తి నమ్మకంతో పూజల కోసం తీసుకెళ్లినట్లు తేలింది.


అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రమంతటా ఆలయాల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వివిధ మతాలకు చెందిన 47,593 ప్రార్థనా మందిరాలు ఉండగా.. వాటిలో 28,567 హిందూ దేవాలయాలు ఉన్నాయి. పది శాతం గుళ్లలో మాత్రమే సీసీ కెమెరాలున్నాయి. మిగిలిన వాటికీ అమర్చాల్సిందిగా నిర్వాహకులను కోరాం. గడిచిన ఆరేళ్లలో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న 8,204మందిని గుర్తించి బైండోవర్‌ కేసులు నమోదు చేశాం.


2015లో రాష్ట్రవ్యాప్తంగా 290 కేసులు నమోదు కాగా.. 2016లో 322, 2017లో 318, 2018లో 267, గత ఏడాది 305 నమోదయ్యాయి. ఈ ఏడాది గతంలో కన్నా తక్కువగా 228 కేసులే నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో నంది విగ్రహాన్ని అపవిత్రం చేసిన ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం’ అని ప్రకటనలో వివరించారు.

Updated Date - 2020-09-29T07:52:24+05:30 IST