మానవ తప్పిదం కాదు
ABN , First Publish Date - 2020-08-22T09:42:35+05:30 IST
తెలంగాణ రాష్ట్ర పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు ..
ఏపీ ఉద్యోగుల తక్షణ సాయం
అమరావతి, కర్నూలు ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర పరిధిలోని శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించారు. తగిన సహాయ సహకరాలను అందజేశారు. గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి లోడ్ డిశ్పాచ్ అధికారులు ఏపీ విద్యుత్ అధికారులకు ఫోన్ చేయగా, ఏపీకి చెందిన కుడి గట్టు విద్యుత్ కేంద్రం అధికారులు అంబులెన్సులను, వైద్యులను సంఘటన స్ధలానికి పంపారు. లైట్లు, బ్లోయర్లు, కేబుళ్లను కూడా అందజేశారు. సమీపంలోని ఆస్పత్రులను కూడా అప్రమత్తం చేశారు. అయితే ప్రమాదం జరిగిన భూగర్భ స్థలంలోకి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేక పోయారు. సీఐఎ్‌సఎఫ్ బలగాలు రంగంలోనికి దిగాకే మధ్యాహ్నం 1-2 గంటల మధ్య తొలి మృతదేహాన్ని గుర్తించగలిగారు.
విద్యుత్‌సౌధ నుంచీ హెచ్‌బీ బ్లోయర్లు తెప్పించి ప్రమాద స్థలంలో కమ్ముకున్న కార్బన్ మోనాక్సైడ్ పొగలను లాగేయగలిగారు. ఈలోపు ప్రమాద స్థలానికి ఇరిగేషన్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి.నారాయణరెడ్డి, కర్నూలు జిల్లా విద్యుత్‌శాఖ చీఫ్ ఇంజినీర్ మురళీధర్ రెడ్డి, డీఈఈ అండ్ ప్రొటోకాల్ ఆఫీసర్ శ్రీశైలం ప్రాజెక్టు సోనానంద్ చేరుకున్నారు. ఈ ప్రమాదం మానవ తప్పిదం కాదని, ఊహించని ఈ ప్రమాదంలో ప్రతిభగల యువ ఇంజినీర్లను కోల్పోవడం బాధాకరమంటూ నారాయణరెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.