ఏసీబీ కస్టడీలో అచ్చెన్నకు తొలిరోజు ముగిసిన విచారణ

ABN , First Publish Date - 2020-06-26T01:46:43+05:30 IST

ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును...

ఏసీబీ కస్టడీలో అచ్చెన్నకు తొలిరోజు ముగిసిన విచారణ

గుంటూరు: ఈఎస్ఐ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు విచారించారు. జీజీహెచ్‌లో అచ్చెన్నను కస్టడీలోకి తీసుకున్న అధికారులు దాదాపు మూడు గంటలపాటు ప్రశ్నించారు. డీఎస్పీ ప్రసాద్ ఆధ్వర్యంలో తొలిరోజు విచారణ ముగిసింది. శుక్రవారం, శనివారం కూడా ఏసీబీ అధికారులు అచ్చెన్నను విచారించనున్నారు. అచ్చెన్నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారని, విచారణకు సహకరించారని ఈ సందర్భంగా  అధికారులు స్పష్టం చేశారు. 


ఇక ఈ కేసులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని మూడు రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ న్యాయస్థానం బుధవారం తీర్పు వెలువరించింది. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నను..  ఆస్పత్రిలోనే విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం 5 గంటలకు ఏసీబీ అధికారులు గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో భేటీ అయ్యారు. అచ్చెన్నను కస్టడీలోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన ఒకే చెప్పడంతో ఏసీబీ అధికారులు అచ్చెన్న గదికి వెళ్లారు. అచ్చెన్నను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు.


ఇక ఇదే కేసులో నలుగురు నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న వీరిని విజయవాడకు తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించినట్లు సమాచారం. కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. 

Updated Date - 2020-06-26T01:46:43+05:30 IST