దళితుల దెబ్బకు దిగొచ్చిన పాలసీ
ABN , First Publish Date - 2020-10-03T07:01:50+05:30 IST
నూతన పారిశ్రామిక విధానంపై దళితుల్లో వచ్చిన వ్యతిరేకతతో ప్రభుత్వం దిగొచ్చింది. టీడీపీ హయాంలో దళితులకు ఉన్న
నూతన పారిశ్రామిక విధానంలో మార్పులకు సర్కారు నిర్ణయం!
గత ప్రభుత్వం తెచ్చిన పాలసీలోని ప్రోత్సాహకాలు, రాయితీలన్నీ వర్తింపు
వాటికి కోతలపైనే దళితుల కన్నెర్ర.. త్వరలో సీఎం సమక్షంలో ప్రకటన
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
నూతన పారిశ్రామిక విధానంపై దళితుల్లో వచ్చిన వ్యతిరేకతతో ప్రభుత్వం దిగొచ్చింది. టీడీపీ హయాంలో దళితులకు ఉన్న పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇప్పుడు కోసేయడంపట్ల ఆ వర్గాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనికితోడు రాష్ట్రంలో పలుచోట్ల దళితులపై దాడులు జరుగుతుండడంతో వాటికి సమాధానం చెప్పుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఓట్లేసి గెలిపించుకుంటే తమకే అన్యాయం చేశారన్న భావన ఆయా వర్గాల్లో క్రమంగా పెరుగుతోంది.
ఇప్పుడిప్పుడే పారిశ్రామికంగా ఎదుగుతున్న దళితులకు ఆ అవకాశమూ లేకుండా చే స్తే ఎలా అన్న నిస్పృహ, కోపం వారిలో నెలకొంది. దళితులకు వెన్నుపోటు అంటూ ‘ఆంధ్రజ్యోతి’ కూడా దీనిపై కథనం ప్రచురించింది. దీంతో ప్రభుత్వం ఈ అంశంపై సీరియ్‌సగానే దృష్టిపెట్టింది. పరిస్థితిపై సీఎంవో ఆరా తీసింది. ఏదో ఒకటి చేయకుంటే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని, దళితుల్లో వ్యతిరేకతకు అడ్డుకట్ట వేయలేమని భావించినట్లు సమాచారం.
దీంతో పారిశ్రామిక విధానంలో దళితులకు సంబంధించిన ప్రోత్సాహకాలు, రాయితీల విషయంలో పునఃపరిశీలన చేసి వాటిని మార్చనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వచ్చే బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో ఈ నూతన ప్రోత్సాహకాలను ప్రకటించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఏం జరుగుతోంది? సీఎంవో ఆరా
సాధారణంగా నూతన పారిశ్రామిక విధానం అంటే...గతం కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు, రాయితీలు ఉంటాయని ఆశిస్తారు. కానీ జగన్ ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానంలో గతంలో ఉన్న వాటిని పెంచకపోగా..వాటికి కోత వేశారు. గత ప్రభుత్వంలో 2015-2020వరకు వర్తించేలా నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చారు. ఆ విధానం కాలపరిమితి ముగియడంతో వైసీపీ ప్రభుత్వం ఈ ఆగస్టులో నూతన విధానం ప్రకటించింది.
అయితే అందులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలకు గత విధానంలో ఉన్న రాయితీలను తగ్గించేసింది. దళితులకు గత విధానంలో 45 శాతం పెట్టుబడి రాయితీ ఉండేది. దానిలో భారీగా కోత విధించారు. మగవారికి 15 శాతం, మహిళలకు 35 శాతానికి తగ్గించేశారు. గతంలో దళితులు జేసీబీలు, ఇన్నోవాలు లాంటివి కొనుగోలు చేసి అద్దెకు నడుపుకొంటామని అంటే...వాటి కొనుగోలు ఖర్చులో కొంత శాతం ప్రభుత్వమే రాయితీగా చెల్లించేది. నూతన విధానంలో ఆ రాయితీ తీసేశారు.
ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టినప్పుడు తొలి మూడేళ్లలోనే పెట్టుబడి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. కానీ నూతన పారిశ్రామిక విధానంలో పెట్టుబడి రాయితీలు మూడేళ్ల తర్వాతే ఇస్తామని ప్రకటించారు. దీంతో పారిశ్రామికవేత్తలు, ముఖ్యంగా దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో అసంతృప్తి నెలకొంది. వీటన్నింటినీ ‘ఆంధ్రజ్యోతి’ కథనాలుగా ప్రచురించింది. దీంతో గత నెలలో దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు...దళిత పారిశ్రామికవేత్తలతో ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. దళితులకు ప్రోత్సాహకాలు, రాయితీల కోత విషయమై ఎక్కడికి వెళ్లినా అడుగుతున్నారని...సమాధానం చెప్పలేకపోతున్నామని కొందరు ఆవేదన కూడా వ్యక్తంచేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ పరిస్థితిని గ్రహించింది. ఏదో ఒకటి చేయకుంటే అసంతృప్తి పెరిగి పరిస్థితి చేజారిపోతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దళితులకు ప్రోత్సాహకాలు, రాయితీలను మళ్లీ పాత విధానంలో ఉన్నట్లే చేయాలని, అదనంగా కూడా కొన్ని అంశాలను జోడించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.