మరో 9,999 కేసులు

ABN , First Publish Date - 2020-09-12T08:54:13+05:30 IST

రాష్ట్రంపై కరోనా దాడి కొనసాగుతూనే ఉంది. వైరస్‌ రోజురోజుకీ తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 5.5 లక్షల మార్కుకి

మరో 9,999 కేసులు

  • 5.5 లక్షలకు చేరువైన పాజిటివ్‌లు
  • కరోనాకు మరో 77 మంది మృతి
  • మరొక వైద్యుడిని బలిగొన్న వైరస్‌
  • కరోనాతో టీడీపీ నేత చలమలశెట్టి మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంపై కరోనా దాడి కొనసాగుతూనే ఉంది. వైరస్‌ రోజురోజుకీ తీవ్రరూపం దాల్చడంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు 5.5 లక్షల మార్కుకి చేరువయ్యాయి. గురవారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 71,137 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9,999 మందికి వైరస్‌ సోకినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా.. తూర్పుగోదావరిలో అత్యధికంగా 1,499, పశ్చిమగోదావరిలో 1081, చిత్తూరులో 1089, గుంటూరులో 920, ప్రకాశంలో 901 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,47,686 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 11,069 మంది కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 4,46,716కి పెరిగింది. శుక్రవారం కరోనా దెబ్బకు 77 మంది బలయ్యారు. కడపలో 9 మంది మరణించగా.. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 8 మంది చొప్పున, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏడుగురు చొప్పున, అనంతపురం, విశాఖపట్నంలో ఆరుగురు చొప్పున, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఐదుగురేసి, తూర్పుగోదావరిలో నలుగురు, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలులో ఒకరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 4,779కు చేరింది.


కరోనాతో రుయా ఆస్పత్రి వైద్యుడు మృతి

చిత్తూరు జిల్లాలో మరో 1089 మందికి కరోనా సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 50463కి ఎగబాకింది. కరోనాతో మరో ఐదుగురు మృతిచెందారు. వారిలో తిరుపతిలోని రుయా ఆస్పత్రి వైద్యుడు మనోహర్‌ కూడా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా 1,081 కేసులు బయటపడ్డాయి. కరోనాతో మరో ఐదుగురు మరణించగా మొత్తం మృతుల సంఖ్య 381కి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో కేసుల అలజడి తగ్గడం లేదు. తాజాగా ఈ జిల్లాలో 1,499 కేసులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో.. మరో 557 మందికి వైరస్‌ సోకింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 48,105కి చేరింది. వీరిలో 43127 మంది కోలుకోగా.. 397 మంది చనిపోయారు.


శ్రీకాకుళం జిల్లాలో 570, విజయనగరం జిల్లాలో 594 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో మరో 497 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 50,679కి చేరుకుంది. వారిలో 46,030 మంది కోలుకోగా.. 407 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో కేసులు 20వేలు దాటేశాయి. తాజాగా 451 మందికి వైరస్‌ సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 20,410కి పెరిగింది. కరోనాతో ఇప్పటి వరకు 337 మంది ప్రాణాలు కోల్పోయారు. కడప జిల్లాలో మరో 698 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 35,269కి చేరింది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 1,159 మంది డిశ్చార్జి అయ్యారు. 9 మంది మృత్యువాత పడడంతో మృతుల సంఖ్య 362కు చేరింది. విశాఖ జిల్లాలో మరో 413 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 43,561కు చేరింది. నెల్లూరు జిల్లాలో కొత్తగా 778 పాజిటివ్‌లు నమోదవగా.. మరో 8 మంది చనిపోయారు. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 43,985కి పెరిగింది.


టీడీపీ సీనియర్‌ నేత చలమలశెట్టి మృతి

కాపు కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నేత చలమలశెట్టి రామానుజయ కరోనాతో శుక్రవారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే కరోనా సోకడంతో విజయవాడ జీజీహెచ్‌లో చేరారు. ఆయనకు వైద్యులు నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఆయన ఉదయం మృతి చెండినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాపు కార్పొరేషన్‌కు తొలి చైర్మన్‌గా రామానుజయ పనిచేశారు.


కరోనా బాధితురాలు ఆత్మహత్య

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ భవనం పైనుంచి దూకి కరోనా బాధితురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరులో చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం పాతమాగులూరుకు చెందిన ఓ మహిళ (55), ఆమె భర్తకు కరోనా నిర్ధారణ కావడంతో ఇద్దరినీ ఈనెల 8న రైజ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. ఆ మహిళకు గతంలో ఆస్తమా ఉంది. దీంతో ఆమె భయపడిపోయింది. కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తనకు ఊపిరి ఆడటం లేదని, చనిపోతానేమోనని భయంగా ఉందని చెప్పింది. శుక్రవారం తెల్లవారుజామున 4.30 గంటలకు భర్త బాత్‌రూంకు వెళ్లగా ఆమె భవనం నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. 

Updated Date - 2020-09-12T08:54:13+05:30 IST