8 లక్షలు దాటేశాయ్‌

ABN , First Publish Date - 2020-10-24T08:04:47+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల మార్కుని దాటేశాయి. శుక్రవారం తాజాగా నమోదైన 3,765 కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల

8 లక్షలు దాటేశాయ్‌

ఏపీలో 8,00,684 కరోనా కేసులు..

రాష్ట్రంలో కొత్తగా 3,765 పాజిటివ్‌లు.. 20 మంది మృతి


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల మార్కుని దాటేశాయి. శుక్రవారం తాజాగా నమోదైన 3,765 కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బాధితుల సంఖ్య 8,00,684కి చేరింది. ఈ క్రమంలో దేశంలో 8 లక్షల కేసులు నమోదైన రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఏపీ కంటే ముందు మహారాష్ట్ర ఈ మార్కుని దాటేసింది. కర్ణాటక కూడా ఎనిమిది లక్షల కేసులకు చేరువ కాగా.. తమిళనాడు ఇటీవలే 7 లక్షల మార్కుని దాటింది.


ఏపీలో మొదటి లక్ష కేసులు నమోదుకి 137 రోజుల సమయం పట్టింది. ఆ తర్వాత నుంచి కేవలం 10, 11 రోజుల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయి. కానీ చివరి లక్ష కేసులు నమోదు కావడానికి సుమారు నెల రోజులు పట్టింది. ప్రస్తుతం రోజుకి 3-4 వేల కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 80,238 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,765 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది.


మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 4,281 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 31,721 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా దెబ్బకు రాష్ట్రంలో మరో 20 మంది చనిపోయారు. మొత్తం మరణాలు 6,544కి చేరుకున్నాయి.


గుంటూరులో కరోనా విజృంభణ

గుంటూరు జిల్లాలో మళ్లీ కరోనా విజృంభణ పెరిగింది. శుక్రవారం జిల్లాలో 523 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 64,372కి పెరిగింది. కరోనాతో మరో నలుగురు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 665కి పెరిగింది. తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 475 కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు 597 మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో కొత్తగా 460 మందికి వైరస్‌ సోకగా ముగ్గురు మరణించారు.


నెల్లూరు జిల్లాలో తాజాగా 122 పాజిటివ్‌లు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 60,356కి చేరుకుంది. కడప జిల్లాలో 225 మందికి వైరస్‌ సోకగా.. కర్నూలు జిల్లాలో 69 మంది కరోనా బారినపడ్డారు. విశాఖ జిల్లాలో మరో 218 కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 55,205కి పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో మరో 199, విజయనగరం జిల్లాలో 126 కేసులు బయటపడ్డాయి.


విద్యార్థులు, ఉపాధ్యాయుడికి కరోనా 

ప్రభుత్వం నవంబరు 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని యోచిస్తున్న నేపథ్యంలో.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో 11 మంది విద్యార్థులకు పాజిటివ్‌ వచ్చింది. ఇది ఈ నెల 17నే తేలినా శుక్రవారం బయటకు పొక్కింది. కొత్తపట్నం మండలం గవండ్లపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఒక ఉపాధ్యాయుడితోపాటు ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. 

 


Updated Date - 2020-10-24T08:04:47+05:30 IST