కొత్తగా 6,133 కేసులు

ABN , First Publish Date - 2020-10-01T07:27:05+05:30 IST

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 7 లక్షల మార్కుకి చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,806 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,133 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది...

కొత్తగా 6,133 కేసులు

  • 6,93,484కి చేరిన పాజిటివ్‌లు
  • 24 గంటల్లో 48 మంది మృతి
  • ఆరు వేలకు చేరువగా మరణాలు 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 7 లక్షల మార్కుకి చేరువయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,806 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,133 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,93,484కి పెరిగింది. గరు, శుక్రవారాల్లో ఈ సంఖ్య 7 లక్షలు దాటే అవకాశం ఉంది. జాతీయస్థాయిలో అత్యధిక కేసుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా.. ఏపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. కర్ణాటక, తమిళనాడు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 983 కేసులు నమోదవగా.. చిత్తూరులో 925, అనంతపురంలో 580 మందికి వైరస్‌ సోకినట్టు తేలింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,075 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం రికవరీలు 6,29,211కి పెరిగాయి. ప్రస్తుతం 58,445 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరో 48 మందిని బలితీసుకుంది. చిత్తూరులో 8, ప్రకాశంలో 6, తూర్పుగోదావరిలో 5, కృష్ణాలో 5, విశాఖపట్నంలో 5, అనంతపురంలో 4, గుంటూరులో 4, పశ్చిమగోదావరిలో 4, కడపలో 3, కర్నూలులోల 2, నెల్లూరు, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాలు 5,828కి పెరిగాయి. 


త్వరలో రెండో విడత సీరో సర్వే: కాటమనేని

రాష్ట్రంలో ప్రస్తుతం 30 వేల మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 58 వేల యాక్టివ్‌ కేసుల్లో 30 వేల మందికిపైగా హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, మిగిలిన వారంతా కొవిడ్‌ ఆస్పత్రులు, కంట్రోల్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. కేంద్రం విడుదల చేసిన సీరో సర్వేలెన్స్‌ సర్వేలో ఏపీలో 9 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉన్నట్లు తేలిందన్నారు. వారు విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే సర్వే నిర్వహించారని తెలిపారు. రాష్ట్రం నిర్వహించిన సర్వేలో 20 శాతంపైనే హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిందన్నారు. 15 రోజుల్లో మరోసారి సర్వే చేస్తామని చెప్పారు. అక్టోబరు చివరి నాటికి కేసుల సంఖ్య తగ్గే అవకాశాలున్నట్లు తెలిపారు.


‘తూర్పు’లో 97 వేలు దాటిన కేసులు 

తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం కొత్తగా 983 మందికి వైరస్‌ సోకడంతో మొత్తం బాధితుల సంఖ్య 97,174కి చేరుకుంది. జిల్లాలో కరోనాతో మరో ఐదుగురు మృతి చెందగా మరణాల సంఖ్య 524కి పెరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 719, గుంటూరు జిల్లాలో 498, కడప జిల్లాలో 387, కర్నూలు జిల్లాలో 216,. అనంతపురం జిల్లాలో  580, విశాఖ జిల్లాలో 145, శ్రీకాకుళం జిల్లాలో 362, విజయనగరం జిల్లాలో 298, కృష్ణా జిల్లాలో 446, నెల్లూరు జిల్లాలో  415 కేసులు కొత్తగా వెలుగుచూశాయి.


Updated Date - 2020-10-01T07:27:05+05:30 IST