6,780 కేసులు

ABN , First Publish Date - 2020-08-18T09:40:40+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు. పాజిటివ్‌ కేసులతోపాటు మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి.

6,780 కేసులు

  • మరో 82 మంది బలి
  • 3 లక్షలకు చేరువైన పాజిటివ్‌లు..
  • మొత్తం మృతులు 2,732
  • తూర్పు గోదావరిలో తగ్గని వైరస్‌ ఉధృతి
  • మాజీ ఎంపీ హర్షకుమార్‌ దంపతులకు కరోనా
  • కొవిడ్‌తో మాజీ మంత్రి భార్య మృతి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతికి అడ్డుకట్ట పడడం లేదు. పాజిటివ్‌ కేసులతోపాటు మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 44,578 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,780 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,96,609కి చేరి 3 లక్షల మార్కుకి దగ్గరైంది. మంగళవారం అది 3 లక్షలు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 82 మంది కరోనాకు బలయ్యారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,732కి ఎగబాకింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడు, నాలుగు రోజుల్లో ఈ సంఖ్య 3 వేలు దాటొచ్చు. తాజాగా తూర్పుగోదావరిలో అత్యధికంగా 911 మందికి వైరస్‌ సోకగా.. గుంటూరులో 776, పశ్చిమగోదావరిలో 724 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల్లో ప్రకాశంలో 13 మంది కరోనాతో చనిపోగా.. తూర్పుగోదావరిలో 10, చిత్తూరులో 8, గుంటూరు, కడపలో ఏడుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ఆరుగురు చొప్పున, అనంతపురంలో కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఐదుగురు చొప్పున, కృష్ణాలో 3, నెల్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. మరోవైపు కొత్తగా 7,866 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 


హర్షకుమార్‌ దంపతులకు వైరస్‌ 

తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 41,204కు చేరింది. 24 గంటల్లో 911 మంది కరోనా బారిన పడ్డారు. మాజీ ఎంపీ, దళితనేత జీవీ హర్షకుమార్‌, ఆయన సతీమణి సరళకుమారికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సరళకుమారి రాజమహేంద్రవరం ప్రభుత్వఆస్పత్రిలో హెడ్‌నర్సుగా పనిచేస్తూ, ఇటీవల కొవిడ్‌ బాధితులకు సేవలందించారు. వారి చిన్న కుమారుడు, కోడలు, వారి బిడ్డకు కూడా కరోనా సోకడంతో అందరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలో కొత్తగా 776 కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో ఎక్కువగా 190, తెనాలిలో 102, నరసరావుపేటలో 66, పొన్నూరులో 60 కేసులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో మరో 535 మందికి వైరస్‌ సోకింది. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 30,062కు చేరింది. కడప జిల్లాలో కరోనా కేసుల సంఖ్య మరోసారి 500 దాటింది. 24 గంటల్లో ఇక్కడ 523 కేసులు వెలుగుచూడగా.. ఏడుగురు కరోనాతో మరణించారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.


24 గంటల్లో జిల్లావ్యాప్తంగా 135 కేసులు మాత్రమే నమోదయ్యాయి.  దీంతో జిల్లాలో మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 12,479కి చేరుకోగా.. కరోనా మరణాలు 229కు పెరిగాయి. కర్నూలు జిల్లాలో కొత్తగా 372 కేసులు బయటపడడంతో మొత్తం బాధితుల సంఖ్య 34 వేలకు చేరువైంది. శ్రీకాకుళంలో మరో 527, విజయనగరంలో 462 కేసులు వెలుగుచూశాయి. చిత్తూరు జిల్లాలో 542 మందికి వైరస్‌ సోకింది. బి.కొత్తకోటకు చెందిన ఓ వృద్ధురాలు కరోనాతో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించగా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అయిన వారెవరూ ముందుకు రాలేదు. స్థానిక యువత స్పందించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా సమాచారం అందుకున్న డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ లోకవర్ధన్‌ కూడా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో 481 కేసులు నమోదవడంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 18,164కు చేరుకున్నాయి. విశాఖ జిల్లాలో మరో 519 మందికి వైరస్‌ సోకింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 25,739కు చేరింది. 


కరోనాతో మాజీ మంత్రి భార్య మృతి

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి పరసారత్నం భార్య కస్తూరమ్మ కరోనాతో పోరాడుతూ సోమవారం ఉదయం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఆరు రోజుల క్రితం భార్యాభర్తలకు కరోనా సోకడంతో రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమలోనే పరసారత్నం సతీమణి చనిపోయారు. తిరుపతిలోని ఓ చర్చి వద్ద ఆమె అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రస్తుతం పరసారత్నం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యు లు చెబుతున్నారు. కాగా.. కస్తూరమ్మ మృ తిపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్‌తో సోమవారం ఫోనులో మాట్లాడారు. పరసా రత్నం ఆరోగ్యం ఎలా ఉందని తెలుసుకున్నారు.

Updated Date - 2020-08-18T09:40:40+05:30 IST