కొత్త కేసులు 491

ABN , First Publish Date - 2020-06-21T09:11:05+05:30 IST

కరోనా విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 491 కేసులు ..

కొత్త కేసులు 491

8,452కు చేరిన పాజిటివ్‌లు 

రాష్ట్రంలో మరో ఐదుగురి మృతి 

101కి చేరిన కరోనా మరణాలు 

8,452కు చేరిన పాజిటివ్‌లు .. రాష్ట్రంలో మరో ఐదుగురి మృతి 

101కి చేరిన కరోనా మరణాలు 


అమరావతి, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి): కరోనా విజృంభణ తీవ్రస్థాయికి చేరుకుంది. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 491 కేసులు వెలుగులోకి వచ్చాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 8,452కు చేరింది. తాజా కేసుల్లో 390మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 83మంది, విదేశాల నుంచి వచ్చిన 18మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం కృష్ణాలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, గుంటూరులో ఒకరిని వైరస్‌ బలి తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 101కి పెరిగాయి. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 97 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో అనంతపురం నగరంలోనే 50కిపైగా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో మరో 62 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. రాయవరం మండలం చెల్లూరులో 14మంది వ్యాధి బారిన పడ్డారు. అతి తక్కువ జనాభా ఉన్న ఈ గ్రామంలో మొత్తం కేసులు 71కి చేరాయి.


ఇటీవల పాజిటివ్‌ వచ్చిన మహిళా వార్డు వలంటీర్‌ నుంచి ఆరుగురికి, కాకినాడ రూరల్‌ తిమ్మాపురంలో ఓ మహిళ నుంచి 8మందికి, సామర్లకోటకు చెందిన ఓ ఇంజనీర్‌ ద్వారా ఆరుగురికి వైరస్‌ సోకింది. కాకినాడ వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కృష్ణాజిల్లాలో మరో 51మందికి వైరస్‌ సోకింది. విజయవాడలోని రాష్ట్రస్థాయి కొవిడ్‌ ఆస్పత్రి ఐసీయూలో పదిరోజుల నుంచి రోజూ 5-10మంది వరకు మరణిస్తున్నారు. వారిలో కనీసం ఇద్దరు, ముగ్గురు కరోనా కారణంగా చనిపోతున్నట్లు వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. కరోనా వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో మరణాలు ఇంకా పెరిగే ప్రమాదం ఉందని వైద్యవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో కొత్తగా 80 కేసులు, గుంటూరు జిల్లాలో 30, కర్నూలులో 15, నెల్లూరు జిల్లాలో 22 కేసులు నిర్ధారణ అయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 31మంది కరోనా బారిన పడ్డారు.


బ్యాంకు ఉద్యోగి, జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉద్యోగి, ఎక్పైజ్‌ కానిస్టేబుల్‌, పోస్టల్‌ ఉద్యోగి, ఆర్టీసీ డ్రైవర్‌ సహా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. విశాఖపట్నం జిల్లాలో మరో 26మంది వైరస్‌ బారినపడ్డారు. విశాఖ నగరానికి చెందిన ఓ మహిళ(41) కరోనాతో శనివారం మృతి చెందింది. కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్న ఆమె పదిరోజుల క్రితం ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రిలో చేరింది. పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలానికి చెందిన వ్యక్తి(52) కరోనాతో మృత్యువాత పడ్డారు. ఈ మరణాలను ప్రభుత్వం ధ్రువీకరించాల్సి ఉంది. Updated Date - 2020-06-21T09:11:05+05:30 IST