-
-
Home » Andhra Pradesh » 400 acres ap news
-
400 ఎకరాలు అన్యాక్రాంతం?
ABN , First Publish Date - 2020-12-06T08:11:58+05:30 IST
విశాఖపట్నం జిల్లాలో 400ఎకరాలకు పైగా భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. వీటి విలువ రూ.1,500కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.

ఆ భూముల విలువ రూ.1,500 కోట్లుగా అంచనా
‘సిట్’ నివేదిక సిద్ధం... ఈ వారంలోనే ప్రభుత్వానికి
కుంభకోణంలో 30 మంది వరకూ ప్రముఖుల పేర్లు
జాబితాలో రాజకీయ నేతలు, ఐఏఎ్‌సలు, ఉన్నతాధికారులు
ప్రజల సలహాలు, సూచనలూ పొందుపరిచిన బృందం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నం జిల్లాలో 400ఎకరాలకు పైగా భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) గుర్తించింది. వీటి విలువ రూ.1,500కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, రికార్డుల ట్యాంపరింగ్‌పై విచారణకు ఏర్పాటైన సిట్ తన నివేదికను సిద్ధం చేసింది. తమ దర్యాప్తులో గుర్తించిన లోపాలు, అక్రమాలతో పాటు ప్రజల నుంచి వచ్చిన పలు సూచనలను కూడా అందులో పొందుపరిచింది.
ఈ వారంలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. కుంభకోణంలో సుమారు 30మంది వరకు ప్రముఖల పేర్లను సిట్ ప్రస్తావించినట్టు తెలిసింది. అందులో పేరొందిన రాజకీయ నాయకులతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. విశాఖ శివారు మండలాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించడానికి రికార్డులు ట్యాంపరింగ్ చేశారనే ఆరోపణలపై వైసీపీ ప్రభుత్వం గతేడాది అక్టోబరులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ నేతృత్వంలో సిట్‌ను నియమించింది. దీనికి జిల్లాలోని 13 మండలాల నుంచి 1,400ఫిర్యాదులు, మరో 150వరకు సూచనలు, సలహాలు వచ్చాయి.
నివేదికలో కీలక అంశాలు
‘22-ఏ’ జాబితాయే అనేక సమస్యలకు మూలం. రెవెన్యూ అధికారులు సర్వే నంబర్లను సబ్ డివిజన్లు చేయకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. తక్షణమే సబ్ డివిజన్లకు శ్రీకారం చుట్టి, 22-ఏ జాబితాలను ప్రక్షాళన చేయాలి. మధురవాడ, రేసపువానిపాలెం, మాధవధార వంటి ప్రాంతాల్లో ఈ సమస్యలు ఉన్నాయి.
కలెక్టర్లు రికార్డులను పరిశీలించకుండానే, అర్హత లేనివారికి ఎన్‌ఓసీలు ఇచ్చారు. వీటి వెనుక రాజకీయ ఒత్తిళ్లు పనిచేశాయి. దీంతో విలువైన ప్రభుత్వ భూములు చేతులు మారాయి. ముఖ్యంగా మాజీ సైనికులు, రాజకీయ బాధితుల పేరుతో జరిగిన ఈ అక్రమాలపై చర్యలు చేపట్టాలి. తగరపువలస, ఆనందపురం, పరవాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో భూములు ఇలా ఇచ్చేశారు.
తహసీల్దార్లు, సర్వేయర్లు చాలా తప్పులు చేస్తున్నారు. రికార్డులు మాయం చేస్తున్నారు. మరికొన్ని రికార్డులను ట్యాంపరింగ్ చేస్తున్నారు. తప్పుడు వివరాలు నమోదు చేస్తున్నారు. విశాఖపట్నం రూరల్, భీమిలి, ఆనందపురం మండలాల్లో ఇలాంటి తప్పిదాలు జరిగాయి.