-
-
Home » Andhra Pradesh » 34 expatriates from Chicago
-
ప్రవాసులు వచ్చారు
ABN , First Publish Date - 2020-05-18T09:52:34+05:30 IST
అమెరికాలోని చికాగో నుంచి 34 మంది ప్రవాసులు ఏపీకి చేరుకొన్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నవీరిని

- షికాగో నుంచి 34 మంది విజయవాడకు
విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి): అమెరికాలోని చికాగో నుంచి 34 మంది ప్రవాసులు ఏపీకి చేరుకొన్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నవీరిని ఆదివారం అధికారులు ప్రత్యేక బస్సులో నేరుగా విజయవాడకు తీసుకొచ్చారు. భవానీపురంలోని హరిత బెర్మ్ పార్క్ వద్ద వారికి జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర స్వాగతం పలికారు. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం భోజన ఏర్పాట్లు చేశారు. వారిలో కృష్ణా జిల్లా ఏడుగురు, గుంటూరు జిల్లా-1, పశ్చిమ గోదావరి-3, విశాఖపట్నం-5, కర్నూలు-4, కడప-1, ప్రకాశం-4, చిత్తూరు-3, అనంతపురం-1, నెల్లూరు జిల్లా-2 ఉన్నారు. భోజనానంతరం వారిలో 33 మందిని నగరంలోని ప్రముఖ హోటల్స్‌లో ఏర్పాటు చేసిన పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఒకరు మాత్రం సొంత ఊరిలో ప్రభుత్వ క్వారంటైన్‌కు వెళతానని చెప్పటంతో కలెక్టర్ ఆమోదం తెలిపి పంపించారు.
20 నుంచి గల్ఫ్.. ఇతర దేశాల ప్రవాసులు..
కాగా, ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు గల్ప్, ఇతర దేశాల నుంచి రాష్ర్టానికి చెందిన ప్రవాసులు నేరుగా విజయవాడకు రాబోతున్నారు. వారిలో చాలా మంది విదేశాలలో పనిచేసే కార్మికులే. ఈ నెల 20న(బుధవారం) లండన్ నుంచి ప్రత్యేక విమానం ముంబై వస్తుంది. మన రాష్ర్టానికి చెందిన వారిని అక్కడి నుంచి మరో విమానంలో విజయవాడ విమానాశ్రయానికి తీసుకొస్తారు. అదే రోజు రాత్రి సౌదీ రాజధాని జెడ్డా నుంచి విజయవాడ విమానాశ్రయానికి ప్రత్యేక విమానం వస్తుంది. అలాగే, 21న కువైత్ నుంచి, 23న రియాద్ నుంచి ప్రత్యేక విమానాలు రానున్నాయి. కాగా, ఈ నెల 27న ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వచ్చే ప్రవాసులను మరో విమానంలో విజయవాడ విమానాశ్రయానికి తరలిస్తారు.