పేరే కొత్త.. 331 క్లినిక్‌లు పాతవే!
ABN , First Publish Date - 2020-12-20T08:41:54+05:30 IST
అమలులో ఉన్న కేంద్ర, రాష్ట్ర పథకాలకు కొద్దిపాటి మార్పులు చేసి కొత్త పేర్లు పెట్టుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తోంది. పట్టణ ప్రజల కు మెరుగైన వైద్యసౌకర్యాలను కల్పించేందుకంటూ

రూ.305 కోట్లతో 560 వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌ల ఏర్పాటు
కొత్త భవనాలకు 284 కోట్లు.. మరమ్మతులకు 21 కోట్ల ఖర్చు
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
అమలులో ఉన్న కేంద్ర, రాష్ట్ర పథకాలకు కొద్దిపాటి మార్పులు చేసి కొత్త పేర్లు పెట్టుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. పట్టణ ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ అదే పంథాను అనుసరిస్తోంది. పట్టణ ప్రజల కు మెరుగైన వైద్యసౌకర్యాలను కల్పించేందుకంటూ రాష్ట్రంలో 560 డాక్టర్ వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో 229మాత్రమే కొత్తగా ఏర్పాటు చేస్తున్నవి. అర్బన్ హెల్త్ సెంటర్ల పేరుతో ఇప్పటికే 331 కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. వీటినే అప్‌గ్రేడ్ చేసి.. ‘డాక్టర్ వైఎస్సార్ అర్బన్ క్లినిక్’ అని బోర్డు తగిలించనున్నారు. 560 క్లినిక్‌ల ఏర్పాటుకు రూ.304.50 కోట్ల వ్యయమవుతుందని పురపాల క శాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు ఒక్కొక్కటి రూ.80లక్షలతో నిర్మితమయ్యే 355 కొత్త భవనాలకు రూ.284 కోట్లు, 205 భవనాల ఆధునీకరణకు 10లక్షల చొప్పున 20.50కోట్లు వెచ్చించనున్నారు. అర్బన్ క్లినిక్‌లకు సంబంధించిన నమూనాలను సిద్ధంచేసిన అధికారులు వాటిని జిల్లాలకు పంపి ఆ ప్రకారమే నిర్మించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. సాంకేతిక అనుమతులు పొందినతర్వాత టెండర్ల ప్రక్రియ నిర్వహించి, పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.