అక్రమార్కులపై కొరడా
ABN , First Publish Date - 2020-11-26T09:03:22+05:30 IST
రైతులకు విత్తనాలు కొనుగోలు చేసినట్లు రశీదు ఇస్తారు. వాటిని బిల్లులో నమోదు చేయరు. రశీదు ఇచ్చిన తర్వాత ఇన్‌వాయి్‌స (బిల్లు) రాస్తే 14.5 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి. అదేమంటే వ్యాపార

29 కోట్ల ఆదాయ పన్ను ఎగవేసిన వ్యాపారులు
లావాదేవీలు లేవని నమ్మించే యత్నం
72 మంది లైసెన్సులు రద్దు చేసిన కమిషనర్
గుంటూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రైతులకు విత్తనాలు కొనుగోలు చేసినట్లు రశీదు ఇస్తారు. వాటిని బిల్లులో నమోదు చేయరు. రశీదు ఇచ్చిన తర్వాత ఇన్‌వాయి్‌స (బిల్లు) రాస్తే 14.5 శాతం ఆదాయ పన్ను చెల్లించాలి. అదేమంటే వ్యాపార లావాదేవీలు జరగలేదంటారు. వ్యాపారం చేస్తున్నట్లు చూపిస్తే వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు కూడా చేస్తారు. వీటి నుంచి తప్పించుకునేందుకు, ఆదాయ పన్ను ఎగవేసేందుకు కొంతమంది వ్యాపారులు ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలోని విత్తన డీలర్లలో ఇటువంటివారు 72 మంది ఉన్నారు. వీరంతా వ్యాపారం లేదంటూ వ్యవసాయ శాఖకు ప్రతినెలా డీఫాం (లావాదేవీలు)లు ఇవ్వటం లేదు. ఇటువంటి 72 మంది డీలర్ల లైసెన్సులను వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ రద్దు చేశారు. గుంటూరు జిల్లాలో 25, కర్నూలులో 24, కృష్ణాలో 13, అనంతపురంలో 3, కడప, ప్రకాశంలలో రెండేసి, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కో లైసెన్స్‌ను రద్దుచేస్తూ కమిషనర్ బుధవారం ఆదేశాలిచ్చారు. ఈ వ్యాపారులు ఆయా ప్రాంతాల్లో రూ.200 కోట్ల విలువైన విత్తనాలు అమ్మి, రూ.29 కోట్లు ఆదాయ పన్ను ఎగవేసినట్లు నిఘా వర్గాల సమాచారం. కాగా లైసెన్సులు రద్దయిన వ్యాపారులు రాజకీయ నేతలతో సిఫార్సులు చేయించి సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.