2 బ్రోచర్లు.. 24 కోట్లు

ABN , First Publish Date - 2020-12-19T08:12:13+05:30 IST

ఊరూరా సచివాలయాలు..వాడవాడలా వలంటీర్లు... ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి గడపగడపకు వీరే అనుసంధానకర్తలు.

2 బ్రోచర్లు.. 24 కోట్లు

ఏడాది పాలనపై ప్రచారానికి

ఆరునెలల తర్వాత ఆర్భాటం

మొత్తం ఖర్చు 24.62 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి):ఊరూరా సచివాలయాలు..వాడవాడలా వలంటీర్లు... ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడానికి గడపగడపకు వీరే అనుసంధానకర్తలు. ఇంకా ప్రచారం కావాలని కోట్లాది రూపాయల ఖర్చుతో సొంత పత్రిక, మీడియాలో కలర్‌ఫుల్‌ ప్రకటనలు. ఇవేవీ చాలవన్నట్లు సర్కారు మరో అడుగు వేసింది. ప్రభుత్వ ప్రచారాన్ని ప్రజల ఇంట్లోకి తీసుకెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఏకంగా రూ.24.62 కోట్లు ఖర్చుపెట్టనుంది. కళ్లుచెదిరే కలర్‌ఫుల్‌ బ్రోచర్లు రెండింటిని ముద్రించి వాటిని నేరుగా ఇళ్లకు పంపించనుంది. ఆ బ్రోచర్ల నిండా ఏడాది పాలనలో జగన్‌ సర్కారు విజయాలు, హామీల అమలును ఏకరువు పెట్టారు. ఒక ఏడాది పాలన ఫలితాలపై ప్రచారానికి ఏకంగా ఇన్ని కోట్ల ఖర్చుకు సన్నద్ధమవుతుండటం ప్రచార కాంక్షకు పరాకాష్ఠ అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్‌ సర్కారు కొలువదీరి గత మే 30 నాటికి ఏడాది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ఏడాది పాలనలో ప్రజలకు జగనన్న చేసిన మేలు ఏమిటో నేరుగా ప్రజలకు తెలియచెప్పేందుకు రెండు రకాల బ్రోచర్లు తెలుగు భాషలో ముద్రించి వాటిని ప్రజలకు పంపించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నం. 257 జారీ చేసింది. బ్రోచర్‌లో మొదటిది ‘‘గుండెల నిండా జగనన్న అజెండా’’.


ఇది మొత్తం 16 పేజీల్లో మినీ పుస్తకంలా ఉంటుంది. రెండొవది ‘‘తొలి ఏడు జగనన్న తోడు’’. ఈ బ్రోచర్‌ ఆరు పేజీల్లో ఉంటుంది. ఒక్కో దాన్ని కోటి కాపీలుగా ముద్రించనున్నారు. రెండు బ్రోచర్లను కలిపి రెండు కోట్ల కాపీలు ముద్రిస్తారు. ఇలా రెండు కాపీలను 40 మెక్రాన్‌ బరువుగల కలర్‌ఫుల్‌ కవర్‌లో పెట్టి ప్రజలకు ఇంటికే పంపిస్తారు. రెండు రకాల బ్రోచర్లు, వాటికోసం రూపొందించే ప్రత్యేక కవర్‌ కోసం రూ. 24,62,40,000 ఖర్చుపెట్టనున్నారు. ఈ మొత్తం బాధ్యతను రాష్ట్ర ప్రణాళిక శాఖ పరిధిలోని స్టేట్‌ డెవల్‌పమెంట్‌ ప్లానింగ్‌ సొసైటీకి (ఏపీఎ్‌సడీపీఎస్‌) అప్పగించారు. 


ప్రచారంపై ఇప్పటికే కోట్లు..

సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కచ్చితంగా లబ్ధిదారులు, ప్రజలకు చేరాలి. ఇందుకు ఆయా శాఖలు ఎలాగూ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పుడు గ్రామాలు,పట్టణాల్లో సచివాలయాలు వచ్చాయి. వార్డు వలంటీర్లు వచ్చారు. ప్రతి ప్రభుత్వ స్కీమ్‌ వారి ద్వారా ప్రజలకు చేరుతోంది. ఊరు,వాడ తేడాలేకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పిస్తున్నారు. ఇంకా కావాలంటే గ్రామ, వార్డు స్థాయుల్లో సభలు ఏర్పాటు చేసుకోవచ్చు. పట్టణాల్లో సభలు నిర్వహించుకోవచ్చు.


లబ్ధిదారులతో నిరంతరం సమావేశాలు నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు ప్రతీ ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి, ప్రభుత్వ సమాచారం ప్రజలకు చేరడానికి మొబైల్‌ సందేశాలు వినియోగిస్తున్నారు. ఇవన్ని ఉన్నా కూడా ప్రతి పథకం గురించి సొంత పత్రిక, మీడియాలో కలర్‌ఫుల్‌ ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు. వీటికే కోట్లాది రూపాయలవుతున్నాయి. సగటున ఒక్కో మొదటి పేజీ ప్రకటనకే కనీసం కోటిన్నరపైనే ఖర్చవుతోంది. గత ఏడాదిన్నర కాలంలో ప్రకటనలపైనే 50 కోట్లపైనే ఖర్చుపెట్టారు. ఇవి చాలవన్నట్లు బ్రోచర్లు కోసం చేస్తున్న రూ.కోట్ల ఖర్చు అదనం. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సర్కారు.. ప్రచారం కోసం కోట్లరూపాయలు ఖర్చుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.


‘‘ఏడాది పాలనపై ఈ ఏడాది జూన్‌ లేదా జూలైలో ప్రచారం చేసుకోవాలి. ఏకంగా ఆరు నెలల తర్వాత ఇప్పుడు ఏడాది పాలన అంటూ రూ. కోట్లు పెట్టి ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది’’     

- ఓ సీనియర్‌ అధికారి విస్మయం

Read more