చంపేసిన శానిటైజర్‌

ABN , First Publish Date - 2020-08-01T09:05:40+05:30 IST

మత్తు కోసం శానిటైజర్‌ తాగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కురిచేడు..

చంపేసిన శానిటైజర్‌

  • 16 మంది మృతి
  • మత్తు కోసం తాగి మరణం
  • కురిచేడులో 19 గంటల్లోనే 12 మంది
  • పామూరులో వారం వ్యవధిలో ముగ్గురు
  •  గుంటూరులో మరొకరు మృత్యువాత
  • మెడికల్‌ షాపులు సీజ్‌..ల్యాబ్‌కు శాంపిళ్లు
  • ఘటనపై సీఎం, డీజీపీ ఆరా
  • ప్రత్యేక బృందంతో విచారణ: ఎస్పీ

కురిచేడు, జూలై 31: మత్తు కోసం శానిటైజర్‌ తాగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలకేంద్రంలో 19గంటల వ్యవధిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, పామూరు గ్రామంలో వారం వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. కురిచేడులో పెళ్లికి హాజరైన గుంటూరు వాసి కూడా శానిటైజర్‌ తాగి ప్రాణాలు కోల్పోయారు. కురిచేడులో కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండటంతో గ్రామాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. మద్యం దుకాణాలను మూసివేశారు. దీనికితోడు మద్యం ధరలు అధికంగా ఉండటంతో మత్తుకు బానిసైన కూలీలు శానిటైజర్‌ తాగడానికి అలవాటుపడ్డారు. పది రోజులుగా శానిటైజర్‌ సేవిస్తున్నారు.


గురువారం సాయంత్రం 6.30 గంటల నుంచి ఒక్కొక్కరుగా ప్రాణాలు విడవడం ప్రారంభమైంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఈ మరణాల పరంపర కొనసాగింది. మృతుల్లో ఐదుగురు కూలీలు, ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒక రైతు, ఇద్దరు యాచకులు, ఒకరు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తి ఉన్నారు. వీరంతా ఎరికివారే శానిటైజర్‌లో నీళ్లు కలుపుకొని తాగారు. మద్యం బాటిళ్లలో ఆల్కహాల్‌ 40 శాతం మాత్రమే ఉంటుంది. శానిటైజర్లలో మాత్రం 70శాతం ఉంటుంది. దీంతో రూ.50కు దొరికే 100 ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిల్‌ను కొనుగోలు చేసి నీళ్లలో కలుపుకొని తాగడం ప్రారంభించారు.  


కురిచేడులో మృతులు వీరే..

ఆటోడ్రైవర్‌ కడియం రమణయ్య(28), యాచకుడు కొనగిరి రమణయ్య(45), విశ్రాంత లస్కర్‌ పాలెపోగు దాసు(65), చిత్తు కాగితాలు ఏరుకునే కొనగిరి బాబు(35), కుందా అగస్టీన్‌(42) గురువారం రాత్రి మరణించారు. కొనగిరి బాబు, కడియం రమణయ్యలను 108లో దర్శి సీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ మృతిచెందారు. కొనగిరి రమణయ్య, దాసు, అగస్టీన్‌ ఇంటి వద్దనే ప్రాణాలు విడిచారు. శుక్రవారం అనుగొండ శ్రీను (29) భోగ్యం తిరుపతయ్య(35), గుంటక రామిరెడ్డి(57), కంభంపాటి దాసు ఇంటి వద్ద మృతిచెందగా, మాడుగుల చార్లెస్‌(36) కురిచేడులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో, రాజారెడ్డి(65) రోడ్డు పక్కన చెట్టు కింద, షేక్‌ సైదా(29) వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో మృతిచెందారు. వారు తాగిన శానిటైజర్లు కల్తీవని స్థానికులు, అధికారులు అనుమానిస్తున్నారు. 


మనవరాలి పెళ్లికొచ్చి..

గుంటూరుకు చెందిన మాతంగి పెద్ద సుబ్బారావు(60) కురిచేడులో జూలై 29న మనుమరాలి పెళ్లికి హాజరయ్యారు. 30న ఆయన కూడా  శానిటైజర్‌ తాగారు. రాత్రికి ఆయాసం ఎక్కువవడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. ఆయాసం ఎక్కువై శుక్రవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు.  


రెడ్‌జోన్‌..నెలరోజులుగా మద్యం షాపులు బంద్‌..

పామూరు రెడ్‌జోన్‌ కావడంతో మద్యం షాపులను నెలరోజులుగా తెరవడం లేదు. దీంతో మద్యానికి బానిసలైనవారు పట్టణంలో విరివిగా లభిస్తున్న శానిటైజర్లను కొనుగోలు చేసి సేవిస్తున్నారు. అలా సేవించినవారిలో పట్టణంలోని తూర్పువీధికి చెందిన యువతి(30) వారంకిందట ఇంటి వద్దే మృతిచెందగా.. ఆకుల వీధికి చెందిన అరటిపండ్ల వ్యాపారి దిండు మల్లికార్జున(31) స్థానిక రాచూరి వారి వీధిలో గురువారం రాత్రి శానిటైజర్‌ తాగి మృతిచెందారు. రాచూరి వారి వీధికి చెందిన పి.రోశయ్య(42) కూడా వారం నుంచి శానిటైజర్‌ సేవిస్తూ శుక్రవారం ఇంటివద్దనే మరణించాడు. 


పోలీసుల విచారణ..

కురిచేడులో శానిటైజర్‌ తాగి అంతమంది మృత్యువాత పడటంతో పోలీసు యంత్రాంగం పెద్దసంఖ్యలో గ్రామానికి వచ్చింది. ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, దర్శి, పొదిలి సర్కిల్‌ పరిధిలోని ఎస్‌ఐలు కురిచేడు చేరుకున్నారు. శానిటైజర్లు ఏఏ కంపెనీలవి? చనిపోయిన వారు వాటిని ఎక్కడ కొనుగోలు చేశారు? ఎక్కడ తాగారు? అని ఆరా తీశారు. కాగా, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ మృతుల ఇళ్లకు వెళ్లి విచారించారు. కల్తీ మద్యం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ ఆరా తీశారు. ప్రత్యేక  బృందాన్ని నియమించి విచారణ చేయిస్తామన్నారు.

Updated Date - 2020-08-01T09:05:40+05:30 IST