మండల, జడ్పీలకు ఆర్థిక పరిపుష్టి!
ABN , First Publish Date - 2020-11-03T09:27:53+05:30 IST
మండల, జడ్పీలకు ఆర్థిక పరిపుష్టి!
15% చొప్పున 15వ ఆర్థిక సంఘం నిధులు.. పంచాయతీలకు 70%
ఈ నిధులన్నీ అభివృద్ధి పనులకే...
జీతాలు, నిర్వహణ ఖర్చులకు కాదు
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందే 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులు కేవలం గ్రామ పంచాయతీలకే ఇవ్వగా.. ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల, జిల్లా పరిషత్‌లకు 15 శాతం చొప్పున విడుదల కానున్నాయి. ఈ స్థానిక సంస్థలకు 2011 జనాభా లెక్కల ప్రకారం 90 శాతం గ్రాంటు, 10 శాతం ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి నిధులు కేటాయిస్తారు. తద్వారా మండల, జిల్లా పరిషత్‌లు ఆర్థికంగా పరిపుష్టం కానున్నాయి. ఈ నిధులను అభివృద్ధి పనులకే కానీ, జీతాలు, ఇతర ఆఫీసు నిర్వహణ ఖర్చులకు వినియోగించరాదు. టైడ్ గ్రాంట్‌ను రెండు విడతలుగా విడుదల చేస్తారు. స్థానిక సంస్థల్లో పారిశుధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత స్థితి కోసం వాడతారు. తాగునీటి సరఫరా, వర్షపునీటి వినియోగం, నీటి పునర్వినియోగం తదితర కీలకమైన సర్వీసుల కోసం సగం ఖర్చు చేస్తారు.