మద్యం బంద్‌తో 1500 కోట్ల నష్టం

ABN , First Publish Date - 2020-04-18T10:28:18+05:30 IST

లాక్‌డౌన్‌ వల్ల మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో ఎక్సైజ్‌శాఖపరంగా ప్రభుత్వానికి రూ.1500 కోట్ల నష్టం వచ్చిందని ఆ శాఖ మంత్రి కె.నారాయణస్వామి తెలిపారు.

మద్యం బంద్‌తో 1500 కోట్ల నష్టం

ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

లోటు బడ్జెట్‌లోనూ ప్రజాసేవకు వెనుకాడం

ఎక్సైజ్‌ మంత్రి నారాయణ స్వామి వెల్లడి 

సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.10 కోట్ల చెక్‌ అందజేత


అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ వల్ల మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో ఎక్సైజ్‌శాఖపరంగా ప్రభుత్వానికి రూ.1500 కోట్ల నష్టం వచ్చిందని ఆ శాఖ మంత్రి కె.నారాయణస్వామి తెలిపారు. అయినా ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని చెప్పారు. ఎక్సైజ్‌శాఖ అధికారులతో శుక్రవారం సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పలు చోట్ల బార్ల నుంచి మద్యం అమ్ముతున్నారనే వార్తల నేపథ్యంలో షాపులు, బార్లలో స్టాకు తనిఖీలు విస్తృతం చేయాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వస్తే వెంటనే చర్యలు తీసుకుంటానన్నారు. కాగా లాక్‌డౌన్‌ సమయంలో మద్యం అక్రమాలపై 2791 కేసులు నమోదుచేసి, 2849 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి  వివరించారు. ఖజానా లోటులో ఉన్నప్పటికీ ప్రజలకు సాయం చేయడంలో తమ ప్రభుత్వం ముందుంటుందన్నారు. 


 సమావేశంలో రెవెన్యూ ఇన్‌చార్జ్‌ సెక్రటరీ పీయూ్‌షకుమార్‌, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌, ఏపీఎ్‌సబీసీఎల్‌ ఎండీ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏపీఎ్‌సబీసీఎల్‌ నుంచి ప్రకటించిన రూ.10 కోట్ల విరాళం చెక్కును సీఎంను కలిసి అందజేశారు. అలాగే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు రెండు రోజుల జీతాన్ని విరాళంగా ఇస్తున్నారని తెలిపారు.


చెక్కు కోసం చిత్తూరు నుంచి..

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రభుత్వం మొత్తుకుంటుంటే ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి మాత్రం కేవలం రూ.10 కోట్ల చెక్‌ ఇవ్వడానికి చిత్తూరు నుంచి అమరావతికి వచ్చారు. పైగా ఇక్కడికి వచ్చాక అధికారులతో సమీక్ష కూడా ఏర్పాటుచేయడంతో అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  


రూ.1200 కోట్ల అదనపు అప్పు

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాల వేస్‌ అండ్‌ మీన్‌ ్స పరిమితిని 60 శాతానికి పెంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం రాష్ట్రాలకు నగదు లభ్యతను పెంచనుంది. ఈ నిర్ణయం వల్ల ఏపీకి అదనంగా ఆర్‌బీఐ నుంచి రూ.1200 కోట్లు అప్పు తెచ్చుకునే అవకాశం కలిగింది. ఆర్‌బీఐ నుంచి వేస్‌ అండ్‌ మీన్స్‌ ద్వారా రాష్ట్రాలు తెచ్చుకునే అప్పునకు రేపో రేటు వర్తిస్తుంది. బ్యాంకుల వడ్డీ రేటు కంటే ఇది తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీకి వేస్‌ అండ్‌ మీన్‌ ్స ద్వారా రూ.1510 కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది.


ఆర్‌బీఐ విధాన సవరణల ఫలితంగా ఆ పరిమితి రూ.2000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ రూ.2000 కోట్లతోపాటు అందులో 60 శాతం అదనంగా అప్పు తీసుకోవచ్చు. అంటే రూ.1200 కోట్లు. దీంతో ఏపీ వేస్‌ అండ్‌ మీన్‌ ్స పరిమితి రూ.3,200 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు సగం వేతనాలు ఇస్తున్నందున ఈ రూ.3,200 కోట్లు ఆ చెల్లింపులకు సరిపోతాయని ఆర్థికశాఖ భావిస్తోంది. మళ్లీ ఉద్యోగులకి వేతనాలు ఇచ్చే సమయానికి ఆర్‌బీఐ నుంచి బాండ్ల వేలం ద్వారా అప్పు సమీకరించే అవకాశాలు ఉన్నాయని ఆర్థికశాఖ అధికారులు చెప్పారు.  

Updated Date - 2020-04-18T10:28:18+05:30 IST